బస్తీబాట రేపే

19 Jan, 2015 05:02 IST|Sakshi
బస్తీబాట రేపే

* గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పర్యటన ..
* అధికారులు ఉరుకులు.. పరుగులు
* ఏర్పాట్లపై  జేసీ శరత్ సమీక్ష
* ‘ఆహార భద్రత’, ‘ఆసరా’ పథకాల అమలుపై ఆరా

గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఉరుకులు..పరుగులు పెడుతోంది. ఈనెల 20న గజ్వేల్ నగర పంచాయతీలో సీఎం కేసీఆర్ బస్తీబాట నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు అప్రమత్తమై సమీక్షల్లో మునిగిపోయారు. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం  జాయింట్ కలెక్టర్ శరత్ పట్టణంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలతో కలిసి ‘ఆహార భద్రత’, ‘ఆసరా’ పథకాలు అర్హులకు అందాయా....? లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్లతో సమీక్ష నిర్వహించారు. సరుకుల పంపిణీలో వెనుకబడిన పలువురు డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం వరకు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయకపోతే సస్పెన్షన్లు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపైనా చర్యలుంటాయన్నారు. ప్రస్తుతం ఆహార భద్రత, ఆసరా పథకాల్లో పేర్ల గల్లంతైన అర్హులకు వెంటనే న్యాయం చేసే దిశగా  పథకాలు మంజూరు చేయాలని జేసీ ఆదేశించారు.

అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణంలో నిర్వహించే పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాపుపై ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి తదితరులతో కలిసి సమీక్షించారు.
 
భద్రత ఏర్పాట్లపై సైతం ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు సైతం నగర పంచాయతీకి సంబంధించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అంశాల వారీగా రెండురోజులుగా సమీక్షలు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు