మినీ థియేటర్లు.. ఆన్‌లైన్‌లో టికెట్లు..

8 Oct, 2017 02:53 IST|Sakshi
ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని ప్రారంభిస్తున్న మంత్రి తలసాని. చిత్రంలో టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ రాంమోహన్‌రావు, ఎఫ్‌డీసీ ఎండీ నవీన్‌ మిట్టల్‌ తదితరులు

టీఎస్‌బాక్స్‌ఆఫీస్‌.ఇన్‌ను ప్రారంభించిన మంత్రి తలసాని

షూటింగ్‌లకు సింగిల్‌ విండో అనుమతులకు ఆన్‌లైన్‌ పద్ధతి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభి వృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌ డీసీ) ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పోర్టల్‌ ప్రారంభమైంది. ‘టీఎస్‌బాక్స్‌ ఆఫీస్‌.ఇన్‌’ ద్వారా ఆన్‌లైన్‌ టికెట్స్‌ పొందొచ్చు. అలాగే షూటింగ్‌ల కోసం సింగిల్‌ విండో అనుమతులు అందించే ఆన్‌లైన్‌ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ రెండింటిని  ప్రారంభిం చుకోవడం నిర్మాతలకు, ప్రేక్షకులకు, థియేటర్‌ యజమానులకు ఎంతో ఉపయోగకరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. శనివారం సచివాలయంలో ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పోర్టల్, సింగిల్‌ విండో అనుమతుల విధానాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి.రమణాచారి, టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్‌ రాంమోహన్‌రావు, ఎఫ్‌డీసీ ఎండీ నవీన్‌ మిట్టల్, జేఎండీ కిషోర్‌ బాబు, సినీ ప్రముఖులు దిల్‌ రాజు, జెమిని కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మంత్రులతో సబ్‌ కమిటీ వేసిందని, వారికి ఉపయోగపడే ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడం కోసం ఐదో ఆట ప్రదర్శనకు అనుమతులు ఇస్తామన్నారు. సినిమా షూటింగ్‌ల కోసం వివిధ శాఖల నుంచి అనుమతుల కోసం నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీఎస్‌ఎఫ్‌డీసీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఏడు రోజుల్లోపు అన్ని అనుమతులు మంజూరవుతాయన్నారు. ఏడురోజుల్లో అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగానే పరిగణించి షూటింగ్‌ ప్రారంభించుకోవచ్చన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధించి స్థలం ఎంపిక కోసం దీపావళి తరువాత పర్యటిస్తామన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని వివరించారు.

సినీ అవార్డుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణాచారి అధ్యక్షతన కమిటీ సమావేశమయ్యిందని, మార్గదర్శకాలు తయారుచేసి సీఎం అనుమతితో నిర్వహిస్తామన్నారు. రమణాచారి మాట్లాడుతూ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా సినీ విభాగాల్లో ఎంతో మంది శిక్షణ పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ రాంమోహన్‌ మాట్లాడుతూ సినీ పరిశ్రమ అభివృద్ధికి పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. చిత్ర పరిశ్రమలో సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగుతామన్నారు. నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ ప్రేక్షకులకు, నిర్మాతలకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ విధానం ఉపయోగపడుతుందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ తరహాలోనే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించామని, భవిష్యత్‌ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని డిజైన్‌ చేసినట్లు ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌ అనుమతులకు సంబంధించి ప్రతి శాఖలో ఒక నోడల్‌ అధికారి ఉంటారని వీరందరు ఏడురోజుల్లో ఆన్‌లైన్‌ అనుమతులు ఇస్తారన్నారు.  

మరిన్ని వార్తలు