ట్రిపుల్‌ తలాక్‌పై రాద్ధాంతం వద్దు: ఒవైసీ 

5 Feb, 2018 03:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రిపుల్‌ తలాక్‌పై కేంద్రం ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ పేరుతో ముస్లిం మహిళలను తప్పుదారి పట్టించొద్దని, దేశంలోని ముస్లిం మహిళలు తమ భర్తలు, పిల్లలతో సంతోషంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డ డివిజన్‌లోని ఏజీ కాలనీలో శనివారం రాత్రి ఆలిండియా పర్సనల్‌ లా బోర్డ్‌ ఆధ్వర్యంలో జల్సా సమావేశాన్ని నిర్వహించారు. అసదుద్దీన్‌ మాట్లాడుతూ ముస్లింలపై ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. 

వివాహ చట్టంలో ముస్లింలకు, హిందువులకు వేర్వేరుగా శిక్షలున్నాయన్నారు.  ముస్లింల సమస్యలు, హక్కుల కోసం జల్సా సభలను నిర్వహిస్తున్నామని, ఈ నెల 11న దారుస్సలాంలో చివరి జల్సా సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ రాష్ట్ర కార్యదర్శి రహీముద్దీన్‌ అన్సారీ, సభ్యులు మునీరుద్దీన్, అక్తర్‌ జాఫర్‌పాషా, హుస్సేనీ, హఫీజ్, మౌలానా అక్సర్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

మరిన్ని వార్తలు