పింఛన్ల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి

3 Dec, 2014 01:55 IST|Sakshi

నిర్మల్ అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ జగన్మోహన్ సూచించారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్ అందేలా చూడాలనిపేర్కొన్నారు. పింఛన్ దరఖాస్తులను పరిశీలించిన విచారణాధికారులు సూచించిన విధంగా వీఆర్వోలు, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శులు పంపిణీ చేయాలన్నారు. పింఛన్ పంపిణీలో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ నెల 15వ తేదీలోపు రెండు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులను పంపిణీ చేయాలన్నారు. ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో మారిన రూల్స్ ప్రకారం తహశీల్దార్లు ఈ నెల 30వ తేదీ లోపు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయాలని సూచించారు. చెరువుల పూడికతీతను చేపట్టేందుకు ఉద్దేశించిన కాకతీయ మిషన్ కార్యక్రమాన్ని సైతం విజయవంతంగా చేపట్టాలన్నారు. దానికి సంబంధించిన విధి విధానాలను వివరించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో నిర్దేశించిన మొక్కలను నాటించాలని సూచించారు. డీఎస్‌వో వసంత్‌రావ్, ఆర్డీవో శివలింగయ్య, వివిధ మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు