T Congress: రంగంలోకి హైకమాండ్‌.. అసంతృప్తులంతా దారికి వచ్చారా?

19 Nov, 2023 17:57 IST|Sakshi

తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తులంతా దారికి వచ్చారా? రెబల్స్‌గా బరిలో దిగినవారంతా ఉపసంహరించుకున్నారా? తిరుగుబాటు దారుల్లో ఇంకా ఎందరు పోటీలో ఉన్నారు? ఉపసంహరించుకున్నవారికి కాంగ్రెస్ హైకమాండ్‌ ఇచ్చిన తాయిలాలు ఏంటి? ఎన్నికల వల్ల ఖాళీ అయిన జిల్లా అధ్యక్షుల కుర్చీలు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎంపీ సీట్ల హామీ ఎవరికైనా ఇచ్చారా? అసలు బుజ్జగింపులు ఫలితమిచ్చాయా?

తప్పని రెబల్స్‌ బెడద
ఎన్నికలంటే అసమ్మతి, అసంతృప్తి, తిరుగుబాట్లు తప్పవు. అన్ని పార్టీలకు ఈ బెడద ఉంటుంది. టిక్కెట్లు ఆశించి భంగపడిన వారు వేరే పార్టీలోకి వెళ్ళి సీట్లు తెచ్చుకున్న ఉదాహరణలు ఈ ఎన్నికల్లో కొల్లలుగా కనిపిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు దాదాపు అన్ని జిల్లాల్లోనూ రెబల్స్ బెడద తప్పలేదు. అధికార బీఆర్ఎస్‌లో సీటు రాని నేతలు కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లారు. అక్కడ కొందరికి సీట్లు, కొందరికి హామీలు లభించాయి.

కాంగ్రెస్‌లో సీట్లు దక్కనివారు బీజేపీ, బీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. కొత్తగా వచ్చినవారికి గులాబీ పార్టీ హామీలు మాత్రమే ఇచ్చింది. బీజేపీ మాత్రం వారు కోరిన సీట్లు ఇచ్చింది. నామినేషన్లు కొనసాగుతుండగానే మూడు పార్టీల నుంచి అటూ ఇటూ.. ఆఖరు రోజు కూడా జంపింగ్‌ జపాంగ్‌లు కొనసాగాయి. రాత్రికి రాత్రే చేరినవారికి కాంగ్రెస్ ఆఫీసుల్లో బీ ఫామ్‌లు ఇచ్చారు. దీంతోనే కాంగ్రెస్‌లో తిరుగుబాట్లు కూడా ఎక్కువయ్యాయి.

కొత్త వారిలో డజన్‌కు పైగా టికెట్లు
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి వచ్చిన వారిలో అనేక మందికి హస్తం టిక్కెట్లు ఇచ్చారు. గాంధీభవన్‌కు కొత్తగా వచ్చిన వారిలో రెండు డజన్లకు పైగా నేతలకు టికెట్లు లభించాయి. దీంతో అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 24 స్థానాల్లో రెబల్స్‌ స్వతంత్రులుగానో...బీఎస్‌పీ లేదా ఫార్వర్డ్‌ బ్లాక్ పార్టీల తరపునో బరిలోకి దిగారు. తమ సీట్లు లాక్కున్న కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామంటూ భీషణ ప్రతిజ్ఞలు చేశారు.

బరిలో నుంచి తప్పుకున్న 20 మంది
అటువంటివారిని దారికి తెచ్చుకునేందుకు నామినేషన్లు ఉపసంహరణ సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. తిరుగుబాటుదారులకు వారి స్థాయిని బట్టి రకరకాల తాయిలాలు, హామీలు ఇచ్చి 20 మంది వరకు బరిలో నుంచి తప్పుకునేలా చేశారు. ఇంకా నాలుగు స్థానాల్లో రెబల్స్‌ పోటీలోనే ఉన్నారు. ఒక్క ఆదిలాబాద్‌ మినహా మిగిలిన చోట్ల రెబల్స్‌ వల్ల అంత ఇబ్బందేమీ ఉండదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
చదవండి: ఒంటరిగా బరిలోకి.. సీపీఎం పోటీతో లాభపడేది! నష్టపోయేది ఎవరు?

బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గలేదు
ఇక సూర్యాపేట కాంగ్రెస్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన పటేల్ రమేష్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. రమేష్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మద్దతిచ్చినప్పటికీ.. ఆయన పలుకుబడి ఉపయోగపడలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సీనియర్ నేతల ఒత్తిడితో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికే సీటు లభించింది. తాను నమ్మకం పెట్టుకున్న రేవంత్‌రెడ్డి చేతులెత్తేయడంతో కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంగా ఉన్న పటేల్ రమేష్‌రెడ్డి ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టిక్కెట్ మీద సూర్యాపేటలో నామినేషన్ దాఖలు చేశారు. 

విలపించిన రమేష్‌ రెడ్డి
రమేష్‌రెడ్డి బరిలో ఉండటం దామోదరరెడ్డికి తీవ్ర నష్టం కలిగించే అంశం. అందుకే పార్టీ నాయకులు ఫోన్ చేసి బుజ్జగించినా ఆయన వెనక్కి తగ్గలేదు. తనకు చేసిన మోసానికి ఫలితం చూడాల్సిందే అంటూ పంతం పట్టారు. పటేల్ పంతంతో నేరుగా ఏఐసీసీ ప్రతినిధిగా రోహిత్ చౌదరి, పీసీసీ ప్రతినిధిగా మల్లు రవి ఆయన నివాసానికి వెళ్ళారు. ఈ ఇద్దరిని చూడగానే రమేష్‌రడ్డి ఇంటి దగ్గరున్న ఆయన అభిమానులు, అనుచరులు వారిని లోనికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. ఒక దశలో మల్లురవిపై దాడికి కూడా ప్రయత్నించారు. ఎట్టకేలకు ఇంట్లోకి వెళ్ళిన రోహిత్‌చౌదరి, మల్లురవిని చూసి రమేష్‌రెడ్డి బోరున విలపించారు. ఇద్దరు నేతలు రమేష్‌రెడ్డి, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడి పోటీ నుంచి తప్పుకునేవిధంగా ఒప్పించారు..

నల్గొండ ఎంపీ సీటు హామీ
అనంతరం ఏఐసీసీ సంస్థాగత ఇన్‌చార్జ్‌ కేసీ వేణుగోపాల్‌కి ఫోన్ చేసి రమేష్‌రెడ్డితో మాట్లాడించారు. పటేల్‌కు నల్గొండ ఎంపీ సీటు ఇస్తామనే హామీతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడానికి అంగీకరించినట్లు సమాచారం. ఏఐసీసీ దూతలతో కలిసి రిటర్నింగ్‌ అధికారి ఆఫీస్‌కు వెళ్ళిన పటేల్ రమేష్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకత్వం ఊపిరి తీసుకుంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు పార్టీని వీడటం, కొందరు ఎన్నికల బరిలోకి దిగడంతో మొత్తం 16 జిల్లా పార్టీ అధ్యక్షుల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడిన నేతలు కొందరు డీసీసీ చీఫ్‌ పోస్టులు డిమాండ్ చేస్తున్నారు. చాలామందికి ఈ పదవులు ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెబల్స్‌గా పోటీలో ఉన్నవారికి డీసీసీ పదవులు, అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ రెబల్స్‌ కథ సుఖాంతమైందని భావిస్తున్నారు. కాని ప్రచారం, పోలింగ్‌ పూర్తయితేనే రెబల్స్‌ పార్టీకి పనిచేశారా లేదా అని తెలుస్తుంది.

మరిన్ని వార్తలు