పోలీసులు కఠినంగా ఉంటేనే అమలు

20 Apr, 2020 04:20 IST|Sakshi
ఆదివారం హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో పరిస్థితి ఇలా

పోలీసులు చూసీ చూడనట్టుంటే.. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు

వాహనాలతో రోడ్లపైకి విచ్చలవిడిగా జనం

అదుపు తప్పుతున్న ‘రెండో విడత లాక్‌డౌన్‌’

సాక్షి, హైదరాబాద్‌: కరోనాను నియంత్రించే క్రమంలో ఒక విడత లాక్‌డౌన్‌ పూర్తయి రెండో విడత అమలవుతున్న ఈ తరుణంలోనూ జనం రోడ్లపైకి రావడం ఆగలేదు. పరిస్థితి రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతున్నా.. కొందరిలో పౌరస్పృహ కనిపించట్లేదు. జన సమూహాలతోనే వైరస్‌ విస్తరిస్తున్నందున, అనవసరంగా రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా కొందరు ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. దాదాపు 80% మంది ఇళ్లకే పరిమితమవుతున్నా, ఇంకా 20% మంది రోడ్లపై తిరుగుతూ ప్రమాదకరంగా మారుతున్నారు. ఎక్కడైతే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారో..ఆ ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌ కచ్చితంగా అమలవుతోంది. పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్న చోట జనం రోడ్డెక్కుతున్నారు.

ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ పోలీసులు రోడ్లపై ఉంటున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదు. అటువంటిచోట్ల రెండో విడత లాక్‌డౌన్‌ నామమాత్రంగానే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రజల్లో, ప్రభుత్వంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పరిస్థితి మరీ తీవ్రంగా మారుతోంది. ఈ తరుణంలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సి ఉంది. కానీ, చాలా ప్రాంతాల్లో పోలీసులు సంయమనంతో వ్యవహరిస్తుండటాన్ని ప్రజలు అవకాశంగా చేసుకుని విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. సాయంత్రం 6 తర్వాత కర్ఫ్యూ అమలవుతున్నా.. చాలా ప్రాంతాల్లో వాహనాలు రయ్యిన దూసుకుపోతూనే ఉన్నాయి. చదవండి: మే 7 వరకు ఇళ్లలోనే..!
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
నగరంలో నమోదైన కేసుల్లో పాతబస్తీవే ఎక్కువ. అటు మలక్‌పేట నుంచి ఇటు టోలిచౌకి వరకు 300పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను జనం యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మల్లేపల్లి నుంచి ఏక్‌మినార్‌ వైపు వెళ్లే దారిలో ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు నమోదై ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా మార్చారు. కానీ ప్రధాన రోడ్డుకు దారితీసే అంతర్గత రోడ్లన్నీ కిటకిటలాడుతూనే ఉన్నాయి. ఈ దారి నుంచి అటు దారుసలాం వైపు వెళ్లే దారిపై ఏమాత్రం నియంత్రణ లేదు. మల్లేపల్లి రోడ్డు దాటగానే వచ్చే కూడలిలో కంటైన్మెంట్‌ బారికేడింగ్‌ సాక్షిగా వెలుపలి వైపు జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. టోలిచౌకిలోనూ పెద్దసంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అక్కడ ప్రధాన రహదారిపై వాహన సంచారం నియంత్రణలో ఉండగా, అంతర్గత రోడ్లలో ‘లాక్‌డౌన్‌’ ఛాయలు కనిపించట్లేదు.

అక్కడ ఠాణా సాక్షిగా.. 
జూపార్కు ప్రధాన రహదారిపై విచ్చలవిడిగా వాహనాలు తిరుగుతున్నాయి. ప్రధాన రోడ్డుపై ఉన్న బహదూర్‌పురా పోలీసుస్టేషన్‌ సాక్షిగా లాక్‌డౌన్‌ ఉల్లంఘనకు గురవుతోంది. ఇక్కడ రోడ్డుపై వంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంలో పోలీసుస్టేషన్‌ ఎదురుగా రోడ్డుపై వాహనాలను నియంత్రించేందుకు ఒకవైపు రోడ్డును మూసేశారు. కానీ రెండోవైపు మార్గంలో (వన్‌వే) వాహనాలు దూసుకుపోతున్నాయి. గోషామహల్‌ నుంచి ఫీల్‌ఖానా రోడ్డు, పేట్లబురుజు మీదుగా ఈ రోడ్డుపై జన సంచారం బాగా ఉంది.

ఇక పాతనగరంలోని చార్మినార్, శాలిబండ ప్రధాన రహదారి నియంత్రణలోనే ఉన్నా, దానికి రెండువైపులా ఉన్న రోడ్లలో మాత్రం లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ జనం సంచరిస్తూనే ఉన్నారు. పాతనగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. కానీ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నందున, పోలీసులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని పలువురు అంటున్నారు. ‘మేం ప్రభుత్వ సూచనలు తు.చ. తప్పకుండా పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యాం. కానీ కొందరు అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. వారి విషయంలో కఠినంగా వ్యవహరించకుంటే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉంది’ అని మెహిదీపట్నంకు చెందిన ప్రశాంతకుమార్‌ అనే బ్యాంకు అధికారి వ్యాఖ్యానించారు. చదవండి: ముమ్మరంగా మాస్కుల తయారీ  

ముఖ్యమంత్రి ఆదేశంతో కొంత మెరుగు
కరోనాపై శనివారం ముఖ్యమంత్రి సమీక్షించి కొన్ని సూచనలు చేయటంతో ఆదివారం పలు ప్రాంతాల్లో పోలీసు నియంత్రణ చర్యలు కొంత మెరుగుపడ్డాయి. కానీ మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో నష్టానికోర్చి లాక్‌డౌన్‌ను అమలు చేస్తుంటే, బాధ్యత లేకుండా వ్యవహరించే కొంతమంది ఆ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తూ అతి సున్నిత వేళ ప్రమాదకరంగా మారారు. దీన్ని పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణించి మరింత కఠినంగా వ్యవహరించాలన్న సూచనలు వస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు