బాలుడిపై పోలీస్‌ దాష్టీకం

3 Sep, 2017 03:28 IST|Sakshi
పోలీసుల దెబ్బలు చూపుతున్న బాలుడు, తల్లి
- తల్లికి వాతలు తేలేలా దెబ్బలు 
- దొంగతనం కేసులో విచారణ 
రూ.60 వేలు లంచం డిమాండ్‌ 
నెలరోజులకుపైగా వేధింపులు
 
సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అనే పదానికి మచ్చ తెచ్చేలా వరంగల్‌ పోలీసులు వ్యవహరిస్తున్నారు. దొంగతనం విచారణ పేరుతో ఓ బాలుడిని, అతని తల్లిని నెలలుగా మానసిక, శారీరక హింసలకు గురిచేస్తున్నారు.  వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మడికొండలో 2017 జూలై 30న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇదే కాలనీకి చెందిన ఓ 15 ఏళ్ల బాలుడు  ఆడుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ కనిపించిన సెల్‌ఫోన్‌ను దొంగిలించి, తెలిసిన వ్యక్తికి రూ. 200లకు అమ్మేశాడు. దీంతో ఆ ఇంటి యజమాని మడికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈఎంఐఈ నంబరు ట్రేస్‌ చేయడం ద్వారా ఫోన్‌ కొనుగోలు చేసిన వ్యక్తి, అతని ద్వారా బాలుడి వివరాలను కనుక్కున్నారు. సెంట్రల్‌ క్రైం స్టేషన్‌కు పిలిచి విచారించారు. అక్కడ బాలుడు చెప్పిన విషయం విన్న పోలీసులు ఇంకోసారి చేయవద్దంటూ హెచ్చరించి వదిలేశారు. 
 
మడికొండలో టార్చర్‌ 
బాలుడితోపాటు అతని స్నేహితులు మరో ముగ్గురిని మడికొండ పోలీసులు విచారణ పేరుతో ఆగస్టు మొదటివారంలో పిలిచారు. ఈ దొంగతనం కేసులో సెల్‌ఫోన్‌తో పాటు రెండు తులాల బంగారం, రూ. 2400 డబ్బులు పోయాయని చెప్పారు. నగల రికవరీ పేరుతో బాలుడు రూ. 60 వేలు, మిగిలిన ముగ్గురు రూ.20 వేల చొప్పున ఇవ్వాలని పోలీసులు డిమాండ్‌ చేశారు. బాధిత బాలుడు నిరుపేద కావడంతో  రూ. 60 వేలు చెల్లించడం సాధ్యం కాలేదు. దీంతో  బాలుడిని పదేపదే పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కొట్టే వారు. కొడుకు కోసం స్టేషన్‌కు వెళ్లిన  తల్లిని కూడా పోలీసులు దారుణంగా కొట్టారు.  
 
కమిలే గాయాలు.. ఆత్మహత్యా యత్నం 
పోలీసుల అమానుష ప్రవర్తనతో  బాలుడు రక్తం కక్కుకున్నాడు. గొంతు, ఛాతీ, వీపు, ఎడమ భుజం, పిక్కల మీద వాతలు తేలాయి. చర్మం కమిలిపోయింది. పోలీసుల వేధింపులకు తాళలేక తల్లి ఆత్మహత్యకు  యత్నించింది. బాలుడు, అతడి తల్లి యాదవ సంఘం నాయకులతో కలసి  శనివారం  డీసీపీ వేణుగోపాల్‌రావును కలసి గోడు వినిపించారు. దీంతో సీఐ శ్రీధర్‌ను డీసీపీ ఫోన్‌లో మందలించినట్లు సమాచారం.  
 
నన్ను, అమ్మను కొట్టారు 
నేను ఆడుకుంటూ నా ఫ్రెండ్‌తో కలసి ఆ ఇంట్లోకి వెళ్లి ఫోన్‌ తీశాను. రికవరీ కోసం అడిగినంత ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. రోజూ స్టేషన్‌కు వచ్చి పొమ్మన్నారు. మా అమ్మ తెలిసిన వారితో ఏసీపీకి ఫోన్‌ చేయించి, నన్ను వదిలేయమంటూ సీఐకి ఫోన్‌ చేయించింది. దీంతో నా టెన్త్‌ సర్టిఫికెట్, ఆధార్‌కార్డులు తీసుకుని రమ్మన్నారు. నేను, మా అమ్మ వెళ్లాం. నన్ను కొడుతుంటే.. పోరడు సచ్చిపోతాడంటూ మా అమ్మ అడ్డువచ్చింది. అమ్మను కాలితో తన్ని, బూతులు తిట్టారు. మహిళా కానిస్టేబుళ్లు చేతులు వెనక్కి పట్టుకోగా మా అమ్మ చేతులు, వీపు, కాళ్లపై బెల్టుతో కొట్టారు.
- బాధిత బాలుడు  
 
ప్యాంటు వేసి తొండలు వదులుతనన్నడు  
కూలి పని చేసుకుని బతుకుతున్న. నా కొడుకు తప్పు చేస్తే కేసు పెట్టి జైలుకు పంపమన్న. కానీ డబ్బులు అడిగిళ్లు. ఇయ్యనందుకు రోజు పిలగాన్ని కొట్టుడే. అడ్డుకోవడానికి పోతే పోలీసు సీఐ సారు నన్ను దారుణంగా కొట్టారు. ‘లం... నీకు ప్యాంటు వేసి, లోపలకి తొండలు పంపుతా..’అంటూ చెప్పలేనట్లుగా తిట్టాడు, చూపించలేని చోట బెల్టుతో కొట్టారు. పైసలు కట్టేదాక వదిలేది లేదు. జైలుకు పంపేది లేదు. రోజూ ఇలాగే ఉంటది అని బెదిరించాడు. 
- బాధితుడి తల్లి  
 
వాళ్లకిది మామూలే..
దొంగతనం కేసులో బాలుడిపై కేసు నమోదైంది. ఇంకా కోర్టులో హాజరు పరచలేదు. దొంగతనం జరిగిన సొమ్మును రికవరీ చేసేందుకు బాలుడికి అవకాశం ఇచ్చాను. నేను ఎవరిని కొట్టలేదు. వాళ్లే ఎక్కడో కొట్టుకుని వస్తున్నారు. ఇది వాళ్లకు మామూలు విషయమే. వాళ్లు రెగ్యులర్‌గా దొంగతనాలు చేస్తుంటారు. 
-కె శ్రీధర్, మడికొండ సీఐ
మరిన్ని వార్తలు