ఆగస్టు 26 నుంచి ‘పోలీస్‌’ ప్రిలిమినరీ

10 Jul, 2018 00:54 IST|Sakshi

ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల తేదీలు వెల్లడి  

ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు నిర్వహణ

ఈ నెల 14వ తేదీ లోపు తప్పుల సవరణకు అవకాశం

అధికారిక మెయిల్‌కు వివరాలు పంపాలి: బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష తేదీలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సివిల్, ఇతర విభాగాల్లోని పోస్టులకు ఆగస్టు 26న 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని 10 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నామని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాస్‌ సోమవారం తెలిపారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐటీ, కమ్యూనికేషన్‌ పరీక్ష సెప్టెంబర్‌ 2న ఉదయం 10 నుంచి 1 వరకు.. ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరోలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నామని తెలిపారు. హైదరా బాద్, పరిసర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలుంటాయన్నారు. కానిస్టేబుల్, ఇతర విభాగాలకు చెందిన తత్సమాన పోస్టులకు సెప్టెంబర్‌ 30న ఉదయం 10 నుంచి 1 వరకు హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని 40 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు.  

తప్పులు సవరించుకోండి 
దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం ఇస్తున్నట్లు బోర్డు చైర్మన్‌ తెలిపారు. అభ్యర్థులు రిజిస్టర్డ్‌ ఈ–మెయిల్‌ ఐడీ ద్వారా support@tsprb.inకు సవరణ అంశాలు తెలపాలని సూచించారు. పుట్టిన తేదీ, కమ్యూనిటీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్, స్థానికత, లింగ భేదం, పరీక్ష మాధ్యమం, ఫొటో, సంతకం తదితరాలను సవరించుకోవచ్చని.. ఇందుకు మెయిల్‌లో రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్, రిజిస్ట్రేషన్‌ నంబర్, సవరించాల్సిన అంశాలను పేర్కొనాలని చెప్పారు. సవరణకు జూలై 14 వరకు గడువిచ్చామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు