కన్నారెడ్డిపై దుర్మార్గం.. నీరజ, ఎస్సైపై కేసు

30 May, 2017 13:48 IST|Sakshi
కన్నారెడ్డిపై దుర్మార్గం.. నీరజ, ఎస్సైపై కేసు

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఓ బీటెక్‌ విద్యార్థినిపై అమానుషంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. లంచం ఇవ్వలేనన్నందుకు పోలీసులు, స్థానిక వ్యవసాయ అధికారిణి నీరజ కలిసి ఈ దుర్మార్గానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ కేసులో వ్యవసాయ అధికారి నీరజ, మొమిన్‌పేట్‌ ఎస్సై రాజులపై తాజాగా మంగళవారం పోలీసుల కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..

వికారాబాద్‌ జిల్లా ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి స్థానికంగా ఎరువుల దుకాణం ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందాలని భావించాడు. ఇందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా స్థానిక వ్యవసాయ అధికారి నీరజను కోరగా.. లైసెన్స్‌ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం ఇవ్వాలని ఆమె అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై కన్నారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ ఆధారాలు కోరడంతో ఆధారాలు సేకరించేందుకు అతను ప్రయత్నిస్తుండగానే.. ఈ విషయం తెలుసుకున్న నీరజ తన భర్తను పిలిపించుకొని అతనిపై దాడి చేసింది. ఆ తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది.

వారు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేసుకోకుండానే కన్నారెడ్డిపై అమానుషంగా వ్యవహరించారు. అత్యంత దారుణంగా అతనిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారని కుటుంబసభ్యులుఆరోపిస్తున్నారు. పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన కన్నారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. చేతులతో కనిపించని దెబ్బలు కొట్టడంతో కన్నారెడ్డి రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని, ఇప్పటికే ఓసారి డయాలసిస్‌ చేశామని, భవిష్యత్తులోనూ ఈ దెబ్బల వల్ల అతని ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముందని వైద్యులు చెప్తున్నారు. తమ కొడుకును దారుణంగా కొట్టి హింసించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే లంచం అడిగిన ఏవో నీరజపైనా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్నారెడ్డి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు