ఏం చేద్దాం!  ఓటర్లకు గాలం వేద్దాం?

7 Apr, 2019 16:10 IST|Sakshi

మొదలైన ప్రలోభాల పర్వం 

మద్యం, డబ్బు పంపిణీకి 

ముఖ్య నాయకులకు బాధ్యతలు 

కుల, యువజన, మహిళా సంఘాలతోసమావేశాలు 

గంపగుత్త బేరాలకు అంతర్గతంగా మంతనాలు

పాలమూరు: పోలింగ్‌కు గడువు సమీపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. తక్కువ వ్యవధిలో వీలైనన్ని ఎక్కువ ఓట్లను కొల్లగొట్టాలనే పంథాను ఆచరణలో పెడుతున్నారు. ఊరూరా తిరగడం కష్టమని భావించి గంపగుత్తగా ఓట్లను రాబట్టేందుకు పార్టీలో సీనియర్ల సలహాలు, సహకారం తీసుకుని కుల సంఘాల మద్దతును కోరుతూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పగలు ప్రచారం నిర్వహిస్తూనే తీరిక వేళల్లో కులపెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో సుమారు 15 లక్షలకు పైగా ఓటర్లు ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో ఈ తరహా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

నిఘా ఉన్నా.. కానరాని నియంత్రణ  

నిబంధనల ప్రకారం కుల సంఘాలతో నిర్వహించే సమావేశాల నిర్వహణ విషయమై ఎన్నికల పరిశీలకులు ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇటీవల ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులను మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారనే నెపంతో వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో ఆయా పార్టీలు ఏ రకంగా ఓటర్లకు చేరువవుతున్నాయనే విషయమై మరింత నిశితంగా పరిశీలనలు పెంచాల్సి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిఘా తీరుని పటిష్టపరిస్తే ప్రజాస్వామ్యంలో ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వేయించే అవకాశం ఉంటుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు  ఓటర్లను అందించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు తీసుకొచ్చిన తాయిలాలను, నజరానాలను పలుచోట్ల పోలీసులు పట్టుకున్నారు. ఇదే తరహాలో ఈ ఎన్నికల్లోనూ మరింత పకడ్బందీగా తనిఖీలను చేపట్టడంతో పాటు అభ్యర్థుల ప్రచారాల తీరుతెన్నులపై వారు చేస్తున్న ఖర్చులపై పరిశీలకులు దృష్టిసారించాల్సి ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి మరింత పక్కాగా నిఘాను పెంచాల్సిన అవసరముంది. 

అదే పద్ధతి 
గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కొన్ని పార్టీలు సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మండలం, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థిత్వానికి బలం చేకూరేలా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాల్లో అభ్యర్థుల అనుచరులు నేరుగా కుల సంఘాలను కలుస్తూ బేరాలు మాట్లాడుకుంటున్నారు. మూడు నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ పద్ధతి అనుకూలించిన విషయం తెలిసిందే. దాన్నే కొనసాగిస్తూ గంపగుత్తగా ఓట్లకు తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెబితే ఓట్లు ఎక్కువగా పడతాయో వారిని గుర్తించి వ్యూహరచన చేస్తున్నారు. 

పడే ఓట్లకే డబ్బుల పంపిణీ..

పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రతి గ్రామానికి వెళ్లే అవకాశం, సమయం ఉండదు.  ఈ క్రమంలో గ్రామానికి ఒకరిద్దరు రెండో కేడర్‌ నాయకులకు డబ్బులు పంచే బాధ్యతలు ఇస్తున్నట్లు తెలిసింది. మరికొందరు పార్టీ నుంచి డబ్బులు తక్కువగా వస్తాయి.. భవిష్యత్‌లో మీకు అధికారం, ఉన్నత అవకాశాలు.. చేసుకోవడానికి పనులు కావాలంటే ఖర్చు పెట్టండి అంటూ ఆఫర్లు ఇస్తే వారితోనే డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు.

గతంలో మాదిరి కాకుండా ఈ సారి అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పోలింగ్‌ బూత్‌లపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయక గణంలో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. డబ్బులు తీసుకున్నవారు ఓటు వేయకపోతే ఎవరు బాధ్యులన్న ప్రశ్నలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాఇ. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల దిగులు గుబులు వెంటాడుతోంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు