పరిశ్రమలకు విద్యుత్ కోత పెంపు

24 Aug, 2014 01:56 IST|Sakshi

వారంలో రెండు రోజులు ఇక మూతే!
 సీఎం వచ్చిన తర్వాత నిర్ణయం?

 
 సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలకు విద్యుత్‌కోత లు రెండు రోజులకు పెరగనున్నాయి. విద్యుత్ డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీలోటు ఏర్పడడంతో పరిశ్రమలకు కోతలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, సీఎం కేసీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అధికారికంగా దీనిని ప్రకటించనున్నట్టు తెలిసింది. వ్యవసాయానికి కూడా విద్యుత్‌కోతలు భారీగా ఉంటున్నాయి. అనేకచోట్ల పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పరిశ్రమలకు కోతలను పెంచి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం పరిశ్రమలకు వారంలో ఒక రోజు కోతలు అమలవుతున్నాయి.

అదేవిధంగా ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లైటింగ్‌కు మాత్రమే విద్యుత్‌ను ఇస్తున్నారు. రోజురోజుకీ విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. శుక్రవారం నాడు (22వ తేదీ) రాష్ట్రంలో 158 మిలియన్ యూనిట్ల (ఎంయు) డిమాండ్ నమోదు కాగా, సరఫరా 138 ఎంయూలే ఉంది. ఎండలు పెరగడంతో గృహవిద్యుత్ వినియోగం పెరిగింది. మరోవైపు వర్షాలు లేకపోవడం వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగం అమాంతంగా ఎక్కువయింది. దీంతోనే కోత పెంచాల్సి వస్తోందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. గృహాలకు ఇప్పటికే భారీగా కోతలు అమలవుతున్నాయని (హైదరాబాద్-4, జిల్లా కేంద్రాలు-6, మండల కేంద్రాలు-8, గ్రామాల్లో 10-12 గంటల కోత) ఈ వర్గాలు వివరించాయి.
 
 టీ జెన్‌కోలో సమ్మెలు నిషేధం

 సాక్షి, హైదరాబాద్: టీ జెన్‌కోలో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ అత్యవసర సేవల చట్టం-1971 ప్రకారం సమ్మెల్ని నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ఆర్నెల్లు నిషేధం అమల్లో ఉంటుంది.
 

మరిన్ని వార్తలు