పల్లె పల్లె.. సద్దిగట్టింది..!

2 Sep, 2018 10:47 IST|Sakshi
నెల్లికుదురు నుంచి బయల్దేరే ట్రాక్టర్‌ను ప్రారంభిస్తున్న మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన మహాసభకు వరంగల్‌ జిల్లాలోని పల్లె పల్లె కదిలి వెళ్తోంది. ముందస్తు ఎన్నికల ప్రచార నేపథ్యంలో భారీ జన సమీకరణతో బల నిరూపణకు వరంగల్‌ టీఆర్‌ఎస్‌ నేతలు ఈ సందర్భాన్ని ఓ అవకాశంగా భావిస్తున్నారు. సభకు సాధ్యమైనంత ఎక్కువగా మందిని తరలించి అధినేతకు తమ బలం చూపించేందుకు సన్నద్ధమయ్యారు. ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ పనులు కూడా పెద్దగా లేకపోవడంతో జనం పల్లెల నుంచి అంచనాలకు మించి సభకు తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 2.5 లక్షల మంది తరలింపును లక్ష్యంగా పెట్టుకోగా.. అంతకంటే ఎక్కువ సంఖ్యలో జనం వస్తుండడంతో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
రూ.80 లక్షల నుంచి రూ.1.50 కోట్లు
సభకు వెళ్తున్న ప్రతి కార్యకర్తకు సగటున రూ.1,000 ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఇందులో రూ.500 ప్రయాణ చార్జీలు కాగా, మిగతా రూ.500 తిండి, ఇతర ఖర్చులుగా లెక్కేశారు. ప్రగతి నివేదన సభ జరిగే రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు 6 వేల నుంచి 8 వేల మంది చొప్పున తరలించేలా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సభకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల నుంచి 10 వేల నుంచి 15 వేల మంది చొప్పున జనాలను తరలిస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.80 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా.

ఔత్సాహిక నేతలు కూడా..
సిట్టింగ్‌  ఎమ్మెల్యేలకు పార్టీ నుంచి కొంత మేరకు ఆర్థిక సహకారం అందినట్లు తెలుస్తోంది.   ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్న ఔత్సాహిక నేతలు కూడా ఎమ్మెల్యేలకు దీటుగా జన సమీకరణ చేస్తున్నారు. వాళ్లు కూడా 4 వేల నుంచి ఐదు వేల వరకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ అధినాయకత్వం నుంచి అందిన ఆర్టీసీ బస్సులకు తోడుగా ప్రైవేటు, సొంత వాహనాలను జనాలకు తరిలించేందుకు వినియోగించుకుంటున్నారు.

1,300 బస్సులు అద్దెకు..
స్టేషన్‌ ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్‌ తూర్పు, పరకాల, ములుగు,  నియోజకవర్గాల్లో  సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఔత్సాహిక నేతలు పోటీ పడి జన సమీకరణ చేశారు. నేతల మధ్య పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో బస్సుల పంపిణీల్లో గొడవలు రాకుండా ఉండేందుకు వీలుగా మంత్రి కడియం శ్రీహరి ఒక్కరే బస్సులన్నీ అద్దెకు తీసుకున్నారు. మొత్తం 1,300 బస్సులను  ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలకు పంపించారు. ఇవి కాకుండా నేతలు స్కూల్‌ బస్సులు,  ప్రైవేటు, డీసీఎంలు  ఇతర వాహనాల్లో జనాలను తరలిస్తున్నారు.

జన  సమీకరణ కోసం పోటీ... 
స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య,  రాజారపు ప్రతాప్‌ జన సమీకరణ కోసం పోటీపడ్డారు.  ఈ నియోజకవర్గంలో 150 గ్రామాలకు గాను  అత్యధికంగా 150  ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయగా.. మిగిలిన వాహనాలు, భోజన ఏర్పాట్లు ఎవరి కార్యకర్తలకు ఆయా నేతలు సమకూర్చారు. రాజయ్య నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జనాలను సమీకరించగా.. రాజారపు ప్రతాప్‌  జఫర్‌గఢ్, ఘణపురం, చిల్పూరు మండలాలపై దృష్టిపెట్టి  ప్రజలను సమీకరించారు. చిల్పూరు మండలం తీగల తండాలో ప్రతాప్‌ మాట్లాడుతూ టికెట్‌ మనకే వస్తుంది... అందరు సభకు రావాలని ప్రజలను కోరారు. 
తూర్పున వాళ్లిద్దరూ.. 
వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు, మేయర్‌ నరేందర్‌ ఎవరికి వారుగా జన సమీకరణ చేశారు. కొండా సురేఖ 253 బస్సులు, 203 కా>ర్లు తదితర వాహనాల్లో 20 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వీరికి అయ్యే భోజన ఖర్చుల కోసం ప్రతి బస్సుకు రూ.3 వేల  చొప్పున ఇచ్చినట్లు సమాచారం.  చేతి ఖర్చుల కింద ప్రతి వ్యక్తికి రూ.200 చొప్పున సమకూర్చినట్లు తెలుస్తోంది. 
మరో వైపు నరేందర్‌  వర్గం కూడా 10 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెబుతోంది. 175 బస్సులు, 20 కార్లు సమకూర్చగా నియోజకవర్గ పరిధిలోని డివిజన్‌కు వెయ్యి మందిని జన సమీకణ చేస్తున్నట్లు చెప్పారు. వీరందరికి భువనగిరి సమీపంలో భోజన వసతి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

ఎవరి లక్ష్యం వాళ్లది.... 
జయశంకర్‌ భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్‌ మధుసుదనాచారి, గండ్ర సత్యనారాయణ రావు వర్గాలు వేర్వేరుగా జన సమీకరణ చేశాయి.  పార్టీ పరంగా 100 ఆర్టీసీ బస్సులను సమకూర్చారు.  ఇక్కడ నుంచి కనీసం 16 వేల మందిని తరలించేందుకు  స్పీకర్‌ వర్గం ప్రయత్నాలు చేస్తున్నాయి. స్పీకర్‌కు పట్టున్న భూపాలపల్లి, శాయంపేట, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల నుంచి కనీసం 8 వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.  మరో వైపు గండ్ర సత్యనారాయణ కూడా భారీగా జనాన్ని పోగేస్తున్నారు. కనీసం 5 వేల నుంచి 6 వేల మందిని తరలించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధానంగా ఆయన ఘణపురం, చిట్యాల. రేగొండ మండలాల మీద దృష్టి పెట్టి ప్రజలను సమీకరించారు. 

సత్తా చాటిన శంకర్‌ నాయక్‌....
మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తన సత్తా చూపించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి 220 బస్సులను ఏర్పాటు చేశారు. మరో 100 ప్రైవేటు వాహనాలను సమకూర్చారు. 15 వేల మందితో  ప్రాంగణంలో నిలబడాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.  ఇక్కడి నుంచే టికెట్‌ ఆశిస్తున్న కవిత కూడా తన వంతుగా భారీగానే  ప్రయత్నాలు చేశారు. అయితే ఆమె వైపు 70 మాత్రమే ప్రైవేటు వాహనాలు పెట్టినట్లు తెలుస్తోంది. కార్యకర్తలను పార్టీ పెట్టిన బస్సుల్లోనే ఎక్కిరావాలని కోరినట్లు తెలుస్తోంది.
 
ఒక్కో ఎమ్మెల్యే20 వేలకు తగ్గకుండా... 
ములుగు నియోజకవర్గంలో మంత్రి చందూలాల్‌ తనయుడు,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్‌  దాదాపు 17 వేల మందిని  జనాలను మహాసభకు తీసుకెళ్లేందుకు  ఏర్పాట్లు చేసుకున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు  30 వేల మందిని,  వరంగల్‌ పశ్చిమ నుంచి వినయ్‌ భాస్కర్‌ 25 వేల మందిని, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ 25 వేలు, పరకాల  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 25 వేల మంది చొప్పున జన సమీకరణ చేస్తున్నారు. పలువురు శనివారం ఉదయం నుంచే వాహనాల్లో సభకు బయలుదేరి వెళ్లారు.  రాత్రి పొద్దు పోయే సమయం వరకు హైదరాబాద్‌కు  చేరుకుంటారు. దగ్గరలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి వేర్వేరుగా ఎవరికి వారు ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలా...  
700 పెద్ద వాహనాలు, 1,000కి పైగా  చిన్న వాహనాలు ద్వారా 30 వేల మందితో సభకు వెళ్తున్నాం. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనాన్ని తలపిస్తున్న స్పందన నేడు కనిపిస్తున్నది. వాహనాల కొరత వల్ల సభకు వచ్చే వారిని తీసుకెళ్లలేకపోతున్నాం. సభకు తరలివస్తున్న వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశాం. – ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పాలకుర్తి ఎమ్మెల్యే 

28 వేల మంది..
జనగామ నియోజక వర్గం నుంచి 28 వేల మందిని తరలిస్తున్నాం. 750  బస్సులు, డీసీ ఎంలు, 70 ట్రాక్టర్లు, 300 చిన్నవాహనాలతో పాటు  90 వివిధ హోదాల్లో ఉన్న సొంత కార్లలో వెళ్తున్నాం. జిల్లా, మండలాలు, గ్రామాల వారిగా ప్రత్యేక కమిటీలను వేసి, లెక్కకు ఒక్క రు కూడా తగ్గకుండా వచ్చేందుకు పకడ్బందీ ప్రణాళిక వేశాం. ఉదయం 10 లోపు  వాహనాలు బయలుదేరాలని సూచించాం.    – ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే

25 వేల మందిని తరలిస్తున్నాం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  సభకు స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి 25వేల మందిని తరలిస్తున్నాం. నియోజకవర్గంలోని 150 గ్రామాల నుంచి 25వేల మందిని తరలించేందుకు 136 ఆర్టీసీ బస్సులు, 63 స్కూల్‌ బస్సులు, 113 డీసీఎంలు, 85 డీజిల్‌ ఆటోలు, 35 ఆటోలు, 500 వరకు ద్విచక్రవాహనాల్లో తరలించేందుకు సిద్ధం చేశాం. ఇప్పటికే దాదాపు 100 ట్రాక్టర్లలో దాదాపు 2వేల మంది వరకు తరలివెళ్లారు. 
– తాటికొండ రాజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కిరణ్‌ మజుందార్‌ షాకు అరుదైన గౌరవం 

‘టీఆర్‌ఎస్‌లో సైనికుడిని’

వికటించిన పెళ్లి భోజనం

చలో మేడారం 

దేవుడి మంత్రిగా మళ్లీ ‘ఇంద్రుడే’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమ్మర్‌లో షురూ

అంతా ఉత్తుత్తిదే

కాంబినేషన్‌ కుదిరింది

వేలానికి  శ్రీదేవి  చీర 

కొత్త దర్శకుడితో?

హేమలతా లవణం