‘కీడెంచి మేలు ఎంచాలి కదా.. అందుకే’

10 Dec, 2018 16:46 IST|Sakshi

గవర్నర్‌తో ముగిసిన ప్రజాకూటమి నేతల భేటీ

ముందస్తు జాగ్రత్తలో భాగంగానే వినతిపత్రం

కూటమికే రాజ్యాంగబద్ధత ఉంటుందన్న ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌ : రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగానే గవర్నర్‌ నరసింహన్‌ను కలిసినట్లు ప్రజాకూటమి నేతలు తెలిపారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనం‍తరం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి,  టీజేఎస్‌ కన్వీనర్‌ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ విలేకరులతో మాట్లాడారు.

ప్రజాకూటమికి రాజ్యాంగబద్ధత ఉంది : ఉత్తమ్‌
ఎన్నికలకు ముందే సమూహంగా ఏర్పడిన ప్రజాకూటమికే రాజ్యాంగబద్ధత ఉంటుందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రేపు(మంగళవారం) ఫలితాలు వెలువడగానే అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానం పలకాల్సిన సందర్భం వస్తే కూటమిని ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశామని తెలిపారు. రేపటి రోజున గవర్నర్‌ను కలిసే అవకాశం దక్కుతుందో లేదోననే ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తగా ఆయనను కలిశామన్నారు. ఒకవేళ ఫలితాలు దగ్గరదగ్గరగా వస్తే మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరామన్నారు. పొత్తుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కు గవర్నర్ కు అందజేశామని తెలిపారు.గెలిచిన అభ్యర్థులకు భద్రత కల్పించాలని విఙ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

కూటమికే సంపూర్ణ మెజారిటీ : కోదండరాం
కాంగ్రెస్‌, టీజేఎస్‌, టీడీపీ, సీపీఐలతో కూడిన ప్రజాకూటమికే సంపూర్ణ మెజారిటీ వస్తుందని కోదండరాం అన్నారు. హంగ్‌ ఏర్పడే పరిస్థితే గనుక వస్తే ఇలాంటి విషయాల్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, సర్కారియా కమిషన్‌ నివేదికను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్నారు.

కీడెంచి మేలు ఎంచాలి కదా : రమణ
ప్రజాకూటమిని తెలంగాణ ప్రజలు ఆదరించారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నందున కీడెంచి మేలు ఎంచాలనే తీరుగా ముందుగానే గవర్నర్‌ను కలిశామన్నారు. తన రాజకీయ మనుగడ కోసం, అధికార దాహంతో కేసీఆర్‌ ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించిన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. 

మరిన్ని వార్తలు