ఆస్పత్రి బాత్రూమ్‌లోనే గర్భిణి ప్రసవం

20 Sep, 2019 22:25 IST|Sakshi

సాక్షి, మెదక్‌: ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్య వైఖరి మరోసారి బయటపడింది. ప్రసవ వేదనతో ఆస్పత్రికొచ్చిన ఓ మహిళను డాక్టర్లు పట్టించుకోలేదు. ఈ ఘటన మెదక్‌ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాలు.. మెదక్‌ మండల పరిధిలోని శమ్నాపూర్‌ గ్రామానికి చెందిన రజిత పురుటి నొప్పులతో శుక్రవారం సాయంత్రం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చేసిన ఆమెకు రక్తం తక్కువగా ఉందని ప్రసవం కష్టం అవుతుందని చెప్పారు. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

ఈక్రమంలో మరుగుదొడ్డి నిమిత్తం రజిత బాత్‌రూమ్‌ వెళ్లారు. అక్కడే నొప్పులు ఎక్కువ కావడంతో వైద్య సాయం కోసం కేకలేశారు. అయినా ఎవరూ రాలేదు.  నొప్పులు తీవ్రం కావడంతో ఆమె బాత్‌రూమ్‌లోనే ప్రసవించింది. పడంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇది గమనించిన బంధువులు ఆమెను అక్కడ నుంచి వార్డులోకి తీసువెళ్లి చికిత్సకు సహకరించాలని వైద్యుల్ని వేడుకున్నారు. అయినా సిబ్బంది ఎవరూ స్పందించలేదు. దాంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఉన్నతాధికారులు ఆమెను వెంటనే ఆస్పత్రిలో అడ్మిషన్‌​ చేసుకుని చికిత్స అందజేశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ సిబ్బంది తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవానికి అవకాశమున్నా పట్టించుకోలేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు