కేసీఆర్‌ జైత్రయాత్ర!

19 Dec, 2018 02:32 IST|Sakshi

సిద్ధమవుతున్నఫెడరల్‌ ఫ్రంట్‌ కార్యాచరణ

త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో పర్యటన

కసరత్తు చేస్తున్నటీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకురాష్ట్రాల బాధ్యతలు

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా తలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌ బలోపేతంపై టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దృష్టి పెట్టారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి తమతో కలసి వచ్చే పార్టీలను సమీకరించాలని నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోపే రాష్ట్రాల వారీగా పార్టీలతో కలసి పని చేయాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌ నెలాఖరులో లేదా జనవరి మొదటి వారంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కార్యాచరణ ప్రారంభించనున్నారు. మొదట ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించి ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. అనంతరం వరుసగా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు దూరంగా ఉండే ప్రాంతీయ పార్టీలతో కలసి సమాఖ్య వ్యవస్థ బలోపేతం నినాదంతో ఫెడరల్‌ ఫ్రంట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో పర్యటించి పలు ప్రాంతీయ పార్టీల మద్దతు కోరారు.

అనంతరం మరిన్ని రాష్ట్రాల్లోని పార్టీలతో సమన్వయం చేసే ఆలోచన చేశారు. లోక్‌సభ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఫెడరల్‌ ఫ్రంట్‌ లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరదని భావించారు. ముందుగా తెలంగాణలో విజయం సాధించి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావాలని యోచిం చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.. ప్రజలు టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపించడం జరిగిపోయాయి. భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ప్రతిష్ట పెరిగింది. సీఎం హోదాలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ సమీకరణ చేసేం దుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా ఉండే బిజూ జనతాదళ్‌ వంటి పార్టీ లను ముందుగా కలుపుకోవాలని భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలకుబాధ్యతలు
ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు కేసీఆర్‌ పకడ్బందీ ప్రణాళిక రచిస్తున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి ఫెడరల్‌ ఫ్రంట్‌ తరఫున లోక్‌సభలో ప్రాతినిధ్యం ఉండేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్యెల్యేలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కో రాష్ట్రానికి ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలతో కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఆయా రాష్ట్రాలకు బాధ్యులుగా ఉండే ఎమ్మెల్యేలు అక్కడి ప్రాం తీయ పార్టీలతో సమన్వయం చేసుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచేలా వ్యూహం రచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రణాళికలను ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలని చూస్తున్నారు.

ఢిల్లీ పర్యటన
సీఎం కేసీఆర్‌ త్వరలోనే ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇదే పర్యటనలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలయ్యేలా కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. తమతో కలసి వచ్చే పార్టీల సమన్వయం కోసం ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయాన్ని సిద్ధం చేసే యోచనలో ఉన్నారు. మొత్తంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక కార్యాచరణపై ఢిల్లీ వేదికగా కేసీఆర్‌ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు