ఫీజుల వివరాలా...మేం ఇవ్వం!

19 Oct, 2017 02:33 IST|Sakshi

విద్యా శాఖ ఆదేశాలను పట్టించుకోని ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు

స్కూల్‌ ఫీజుల నియంత్రణ కోసం మూడేళ్ల ఆదాయ వ్యయాల వివరాలివ్వాలన్న విద్యా శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విధానాన్ని ఖరారు చేసేందుకు మూడేళ్ల ఆదాయ వ్యయాల వివ రాలు ఇవ్వాలని విద్యాశాఖ మొత్తుకుంటున్నా.. పాఠశాలల యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. వివరాలు అందజేసేందుకు 45 రోజులు గడువిచ్చినా మూడో వంతు పాఠశాలలు కూడా ఇవ్వకపోవడం గమ నార్హం. రాష్ట్రవ్యాప్తంగా 11 వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. 2,962 స్కూళ్లు మాత్రమే ఆదాయ వ్యయాల వివరాలను అందజేశాయి. తమకు మరింత సమయం కావాలని ప్రైవేటు స్కూల్‌ ఫీజుల విధానంపై ఏర్పాటైన ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీని కోరుతున్నాయి.

అడ్డగోలుగా వసూలు చేస్తూ..
ప్రైవేటు స్కూళ్లలో పట్టణాల్లోని టాప్‌ స్కూళ్లు, కార్పొరేట్‌ పాఠశాలలే ఐదు వేల వరకు ఉన్నాయి. అవి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. రూ.35 వేల నుంచి రూ.3 లక్షలకు పైగా వసూలు చేస్తున్న పాఠశాలలు కూడా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలన్న డిమాండ్‌తో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో 2015–16, 2016–17 విద్యా సంవత్సరా లకుగాను ఫీజులు, ఇతరత్రా రూపంలో వచ్చిన ఆదాయం, ఖర్చు చేసిన మొత్తా ల వివరాలను, ఆడిట్‌ రిపోర్టులను, 2017–18 విద్యా సంవత్సరంలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను అందించాలని విద్యా శాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై కొన్ని స్కూళ్లు స్పందించి వివరాలు అందజేసినా.. టాప్‌ స్కూళ్లు, ఇంట ర్నేషనల్, కార్పొరేట్‌ స్కూళ్లు తమ ఆదాయ వ్యయాల వివరాలను ఇవ్వలేదు.

లోపాలు కప్పిపుచ్చుకునేందుకే..
చాలా టాప్, కార్పొరేట్‌ పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజులకు, కల్పిస్తున్న వసతులకు, పనిచేసే టీచర్లకు ఇస్తున్న వేతనాలకు పొంతన లేకుండా ఉంటోంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ట్యూషన్‌ ఫీజు, ఇతరత్రా సదుపాయాల పేరుతో వసూలు చేస్తున్న మొత్తాలకు ఎలా లెక్కలు చూపించాలో యాజమాన్యాలకు అర్థం కావడం లేదు. ఆదాయ వ్యయాల వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ పలుమార్లు నోటీసులివ్వడంతోపాటు సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చెప్పింది. దీంతో లెక్కలు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా స్కూళ్లు తమ లోపాలను కప్పిపుచ్చుకొని తప్పుడు లెక్కలతో రిపోర్టులు తయారు చేసు కునే పనిలో పడ్డాయి. అందుకే వివరాలు ఇచ్చేందుకు సమయం కావాలని కోరుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ వివరాలు వెల్లడించాల్సిన గడువు ఈ నెల 15తోనే ముగిసినా గడువు పెంచాలని స్కూళ్లు కోరుతున్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డిలలోనే అత్యధికం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 40 శాతం పాత హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో 2 వేల వరకు ప్రైవేటు స్కూళ్లు ఉంటే.. వివరాలు ఇచ్చింది కేవలం 219 పాఠశాలలే. రంగారెడ్డి జిల్లాలో 1,310 స్కూళ్లకుగాను 271 స్కూళ్లు మాత్రమే వివరాలు అందజేశాయి. వీటితో పాటు ఇతర జిల్లాల్లోనూ పలు పాఠశాలలు వివరాలిచ్చినా అవి అసమగ్రంగానే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని స్కూళ్లు 2015–16 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కలే ఇస్తే.. మరికొన్ని స్కూళ్లు 2016–17కు సంబంధించిన లెక్కలను మాత్రమే అందజేసినట్లు చెబుతున్నారు. అయితే అన్ని పాఠశాలల నుంచి వివరాలు వచ్చాక వాటిల్లో లోపాలు, ఇతర వివరణలపై దృష్టి సారించాలని విద్యాశాఖ భావిస్తోంది.

మరిన్ని వార్తలు