అ‘గమ్య’ గోచరం 

31 Mar, 2018 11:49 IST|Sakshi
మితిమీరిన ప్రయాణికులతో ఆటో ట్రాలీ వాహనంలో ఇలా...

ప్రమాదపుటంచున ప్రయాణాలు.. 

ప్రత్యామ్నాయం లేక ప్రైవేటు వాహనాలే దిక్కు

పరిమితికి మించి ప్రయాణికులు 

జిల్లాలో 411 గ్రామాలకు ఆర్టీసీ బస్సు లేదు

రోడ్డు సౌకర్యమున్నా.. రవాణా శాఖ నిర్లక్ష్యం

చుంచుపల్లి :  ‘4 ఇన్‌ ఆల్‌’.. ‘పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు’.. ఆటోలు, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్‌ సందర్భంగా రవాణా శాఖ అధికారులు విధించే నిబంధనలు ఇవీ. కానీ ఇవి రాతలకు మాత్రమే. ప్రైవేటు వాహనదారులు లాభాపేక్షతో ఇష్టారాజ్యంగా ప్రయాణికులను ఎక్కిస్తుంటారు. పరిమితికి మించి ప్రయాణికులతో పాటు మితిమీరిన వేగం.. ఇలా జిల్లాలో నిత్యం పలు ప్రమాదాలు జరుగుతున్నా.. రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు.  ప్రజా రవాణా వ్యవస్థలో ఆటోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ప్రజల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులు నడపకపోవడం, ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పనులకు వెళ్లే కూలీలు.. ఇలా అన్ని వర్గాల వారికీ ఆటోలే దిక్కుగా మారాయి. జిల్లాలోని అనేక గ్రామాలకు రోడ్లు సరిగా లేవనే సాకుతో అధికారులు ఆర్టీసీ బస్సులు నడపటం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలు ఎక్కి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.  

జిల్లాలో రవాణా పరిస్థితి ఇదీ.. 
జిల్లాలో 205 గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలో 1,321 ఆవాస గ్రామాలు ఉన్నాయి. వీటిలో జిల్లాలో 411 గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రోడ్లు సక్రమంగానే ఉన్నా.. తమ గ్రామాలకు బస్సు రావడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో 289 ఆర్టీసీ బస్సులున్నాయి. వీటి ద్వారా నిత్యం 1.02 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో 30 నుంచి 40 వేల మంది ప్రయాణం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 13, 330 ఆటోలు, 1,461 ట్రాలీ ఆటోలు, 6,704 కార్లు, 69 ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈ వాహనాల్లో ఎక్కువ శాతం పర్మిట్‌ నిబంధనలను అతిక్రమిస్తున్నవే కావడం గమనార్హం. ఆటోల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. వివిధ కంపెనీలు తయారు చేసిన వాహనాలకు అదనంగా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు అతి వేగంతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. 

ఆటోల్లో 10 మందికి పైగానే... 
నిబంధనల ప్రకారం ఆటోలో డ్రైవర్‌తో కలిపి నలుగురు మాత్రమే ప్రయాణించాలి. కానీ ఏ ఆటో చూసినా 10 – 15 మంది వరకు కుక్కేస్తున్నారు. ఎక్కువ మంది కూర్చునేలా అదనపు సీట్లు ఏర్పాటుచేస్తున్నారు. సకాలంలో బస్సులు రాకపోవడంతో వేచి చూసి, విసిగి వేసారుతున్న ప్రయాణికులు త్వరగా గమ్యం చేరాలనే హడావిడిలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పలు గ్రామాలకు బస్సులే లేకపోగా, మారుమూల గ్రామాలకు ఉదయం ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు మాత్రమే నడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలే శరణ్యం అవుతున్నాయి. 

ప్రజల్లో మార్పు రావాలి 
ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. అయితే మానవతా ధృక్పథంతో పూర్తిస్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టలేకపోతున్నాం. ఈ విషయమై అనేక సార్లు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. ప్రధానంగా ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రైవేటు వాహనాల వల్ల జరిగే ప్రమాదాల విషయంలో భయం ఏర్పడాలి. ప్రాణం చాలా విలువైనది. దానిని గమనించి ప్రతి ఒక్కరు సురక్షితమైన ప్రయాణాన్ని చూసుకోవాలి. జిల్లాలోని ప్రైవేటు వాహనాల డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించేలా చర్యలు చేపడతాం.
– బి.కృష్ణారెడ్డి, రవాణా శాఖాధికారి  

చీకటే మిగిలింది.. 
బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన రావులపల్లి నర్సింహారావు(38) జనవరి 14న నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బస్టాప్‌ మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో మోటార్‌సైకిల్‌పై వస్తున్న నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబం దిక్కులేనిదైంది. తాపీపనులు చేస్తూ భార్యాపిల్లలతో సంతోషంగా గడిపై నర్సింహారావు మరణంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి.

ప్రస్తుతం ఆయన భార్య స్వప్న కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇద్దరు కుమార్తెలు సంధ్య, నందినిని చదివిస్తోంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని ఆమె కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తన భర్త ఉన్నప్పుడు పిల్లలు ఏదడిగినా తెచ్చిపెట్టేవారని, ఇప్పుడు చాలా కష్టమవుతోందని స్వప్న రోదిస్తోంది. ప్రమాదం జరిగి రెండున్నర నెలలు కావస్తున్నా తనకు ఎలాంటి పరిహారమందలేదని చెపుతోంది.  

మరిన్ని వార్తలు