ఆపదొస్తే ఆగమే! 

4 Jun, 2018 08:23 IST|Sakshi

విశ్వనగరంలో ‘విపత్తు నిర్వహణ’ అధ్వానం 

వరదలు, భారీ వర్షాలను ఎదుర్కోవడంలో విఫలం 

గతంలో 22 సెం.మీ వర్షానికే మహానగరం అతలాకుతలం 

ఏళ్లు గడిచినా మారని తీరు... 

అమలుకు నోచుకోని కిర్లోస్కర్‌ కమిటీ సిఫారసులు 

వర్షాకాలం సమీపిస్తుండడంతో నగరవాసుల్లో ఆందోళన 

సాక్షి,సిటీబ్యూరో : భారీ వర్షాలు, వరదలు, అగ్నిప్రమాదాలు, భారీ భవంతులు కూలి పోవడం వంటి విపత్తులు సంభవిస్తే తక్షణమే స్పందించే ‘విపత్తు నివారణ వ్యవస్థ’ నగరంలో అధ్వానంగా మారింది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని పలు ప్రాంతాలు నీటమునుగుతూనే ఉన్నాయి. జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రెండేళ్ల క్రితం బండారీ లేఅవుట్‌.. గతేడాది రామంతాపూర్‌ ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా నీటమునిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వర్షాకాలంలో మళ్లీ ఏప్రాంతాలు నీటమునుగుతాయోనని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా నగరంలో వరదనీరు సాఫీగా వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేదు. నాలాలు భారీగా ఆక్రమణలకు గురయ్యాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారాయి. ఈ కారణాల వల్లే భారీ వర్షం కురిస్తే వరద నీరు వెళ్లే దారిలేక ఇళ్లను ముంచెత్తుతోంది.  

విశ్వనగరంలో గంటకో సెంటీమీటరు చొప్పున వర్షం కురిస్తే 24 గంటల్లో  మహానగరం నీట మునగడం తథ్యమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో సుమారు 234 నీట మునిగే(వాటర్‌లాగింగ్‌) ప్రాంతాలు, సుమారు 300 బస్తీలు తరచూ నీటమునుగతున్నట్లు బల్దియా లెక్కలు వేసినా..నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌ నివాసం ఉండే రాజ్‌భవన్, అసెంబ్లీ, అమీర్‌పేట్‌ మైత్రీవనం, ఖైరతాబాద్‌ తదితర ప్రధాన ప్రాంతాలు నీటమునిగే జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ప్రణాళిక కానీ, చేసిన పనులు కానీ లేవంటే అతిశయోక్తి కాదు. 2016 సెప్టెంబర్‌ నెలలో మహానగరంలో ఒకే రోజు సుమారు 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నిజాంపేట్‌ పరిధిలోని బండారీ లేఅవుట్‌ సహా పదికిపైగా కాలనీలు నీటమునిగాయి. వందలాది బస్తీల్లో ఇళ్లలోకి నీరుచేరింది. వారం రోజులపాటు ప్రధాన రహదారులు మోకాళ్లలోతున వరదనీరు నిలిచి అధ్వాన్నంగా మారాయి. ఏడాది గడిచినా ఈ దుస్థితిలో ఎలాంటి మార్పురాకపోవడం గ్రేటర్‌ దుస్థితికి అద్దం పడుతోంది.  

కాగితాలపైనే కిర్లోస్కర్‌ నివేదిక.. 
నగరంలో వరదనీటి కాలువల అధ్యయనం..విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై గతంలోనే కిర్లోస్కర్‌ కన్సల్టెంట్స్‌కు బాధ్యత అప్పగించారు. 2003లో నివేదిక నందించిన కిర్లోస్కర్‌ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అందుకు దాదాపు రూ. 264 కోట్లు ఖర్చవుతుందని  అంచనా వేశారు. పాత ఎంసీహెచ్‌ పరిధిలోని 170 చ.కి.మీ. ఉన్న నగరంలో మేజర్‌ నాలాల అభివృద్ధికోసం కిర్లోస్కర్‌ కమిటీ ఈ నివేదిక రూపొందించగా, మైక్రోలెవల్‌ వరకు  వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాల్సిందిగా అధికారులు 2006లో కిర్లోస్కర్‌ కమిటీకి సూచించారు. 2007 ఏప్రిల్‌లో నగర శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో గ్రేటర్‌ హైదరాబాద్‌గా ఏర్పటయ్యాక విస్తీర్ణం 625 చ.కి.మీలకు పెరిగింది.

దీంతో గ్రేటర్‌ మొత్తానికీ ‘సమగ్ర మాస్టర్‌ప్లాన్‌.. సూక్ష్మస్థాయి వరదనీటి పారుదల నెట్‌వర్క్‌ప్లాన్‌ ..మేజర్, మైనర్‌ వరదకాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) బాధ్యతను ఓయంట్స్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్‌లో వరదనీటి సమస్య పరిష్కారానికి రూ. 6247 కోట్లు  అవసరమవుతాయి. ఈ నిధులతో మేజర్‌ నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. సుమారు 390 కి.మీ మేర విస్తరించిన ప్రధాన నాలాలకు ఆనుకొని ఉన్న సుమారు 9 వేల  ఆక్రమ నిర్మాణాలను తొలగించాలి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉంది. 

మెట్రో నగరాల్లో విపత్తు స్పందన భేష్‌..  
ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా మెట్రో నగరాల్లో విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాటు చేసిన విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అందుబాటులో ఉంది. ఇందులో ఆయా నగరపాలక సంస్థలు, జలబోర్డులు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. విపత్తు నిర్వహణ విభాగానికి ప్రత్యేక కార్యాలయం, ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తారు. విపత్తు సంభవించిన ప్రతిసారీ సంస్థ సభ్యులు ఆయా విభాగాలను అప్రమత్తం చేయడంతోపాటు సుశిక్షితులైన సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపడతారు. వీరికి అవసరమైన సాధనాసంపత్తి అందుబాటులో ఉంది. ఏదేని భవంతి నేలమట్టమయిన వెంటనే విపత్తు స్పందనా దళం సభ్యులు నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడతారు.  

విపత్తును ఇలా ఎదుర్కొంటేనే మేలు.... 

  •      నగరంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, రెవెన్యూ, పోలీసు, వాతావరణశాఖ, అగ్నిమాపక శాఖ, హెచ్‌ఎండీఏల సమన్వయంతో విపత్తు స్పందనా దళం ఏర్పాటు చేయాలి.  
  •      నగర భౌగోళిక పరిస్థితిపై విపత్తు స్పందన దళానికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇందుకు సంబంధించిన మ్యాప్‌లు వారి వద్ద సిద్ధంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు రాకముందే మాక్‌డ్రిల్‌ చేసిన అనుభవం బృందానికి ఉండాలి.  
  •      విపత్తు స్పందన దళానికి ప్రత్యేక కార్యాలయం ఉండాలి. గ్యాస్‌కట్టర్లు, రెస్క్యూల్యాడర్లు, ప్రొక్లెయిన్లు, ఫైరింజన్లు, క్రేన్లు, అగ్నినిరోధక దుస్తులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఫస్ట్‌ఎయిడ్‌కిట్లు, అంబులెన్స్‌ తదితరాలు సొంతంగా ఉండేలా చూడాలి. 
  •      నగరంలోని పురాతన భవనాల్లో ఉన్న సూక్ష్మ పగుళ్లు, భవనాల నాణ్యత, మన్నికను గుర్తించేందుకు బార్క్‌(బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌సెంటర్‌)సిద్ధంచేసిన రేడియోధార్మిక టెక్నాలజీని వినియోగించాలి. 
  •      నగరంలోని అన్ని నాలాలు, లోతట్టు ప్రాంతాలకు జీఐఎస్‌ పరిజ్ఞానం ద్వారా గుర్తించి మ్యాపులు సిద్ధంచేయాలి. 
  •      లోతట్టు ప్రాంతాల్లో ఆటోమేటిక్‌ రెయిన్‌గేజ్‌ యంత్రాలు ఏర్పాటుచేయాలి. 
  •      వర్షాకాలానికి ముందే వరదనీటి కాల్వలు, నాలాలు, భూగర్భ డ్రైనేజి లైన్లను పూడిక తీయాలి.  
  •      వరద ముప్పున్న ప్రాంతాల్లో అత్యవసర మోటార్లు ఏర్పాటుచేసి నీటిని తోడాలి. ఇళ్లలోకి నీరు ప్రవేశించకుండా చూడాలి. 
  •      ప్రతి నాలాకు రక్షణ వలయం, నాలాకు ఆనుకొని ఉన్న బస్తీలకు రక్షణ గోడను, ఇసుకబస్తాలను ఏర్పాటుచేసి రక్షణ కల్పించాలి. నాలాలు, చెరువులు, కుంటల ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. 

మరిన్ని వార్తలు