Diseases Rainy Season: రోగులతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు.. వైరల్‌ ఫీవర్స్‌తో జనం ఇబ్బందులు

29 Aug, 2023 15:03 IST|Sakshi

వాతావరణ మార్పులతో జిల్లాలో ఒక్కసారిగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా జనం సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. డయేరియా, వైరల్‌ జ్వరాలు సోకుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి.

ఈ ప్రభావం ప్రజారోగ్యంపై పడింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేరు నమోదుకు జనం బారులు తీరుతున్నారు. ఇందులో చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చినవారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈనెలలో కురిసిన వర్షాల కారణంగా ఒక్కసారిగా వైరల్‌ కేసులు పెరిగాయి. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచాన పడుతున్నారు.

వైద్యారోగ్యశాఖ అప్రమత్తం

సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ప్రారంభించారు. విష జ్వరాలు, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు చేపడతున్నారు. ముఖ్యంగా డయేరియా, వైరల్‌ ఫీవర్లతో ఆసుపత్రికి ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. డ్రమ్ములు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలి విష జ్వరాలు పెరిగే అవకాశం ఉంది.

దుర్శేడ్‌లో ఒకరికి డెంగీ

కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌లో డెంగీ కేసు నమోదు కావడంతో అధికారులు సోమవారం నియంత్రణ చర్యలు చేపట్టారు. దుర్శేడ్‌కు చెందిన కాశిపాక అర్జున్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఫుడ్‌ డెలివరీ సంస్ధలో పనిచేస్తున్నాడు. రెండురోజులక్రితం జ్వ రం రావడంతో దుర్శేడ్‌కు వచ్చిన అర్జున్‌ ఆది వారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకోగా డెంగీగా వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు.

ఎంపీడీవో జగన్మోహన్‌రెడ్డి, సర్పంచు గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచు సుంకిశాల సంపత్‌రావు, వార్డుసభ్యుడు అశోక్‌, ఏఎన్‌ఎం పద్మ, ఆశావర్కర్లు అనిత, లక్ష్మి తదితరులు అర్జున్‌ ఇంటిని సందర్శించారు. కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. ఇంటి పరిసరాలను పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించి బ్లీచింగ్‌ చల్లారు. అనంతరం చామనపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సమీపంలోని నివాస గృహాల్లోని వ్యక్తులకు వైద్యపరీక్షలు చేశారు.

అందుబాటులో వైద్యులు, మందులు

వ్యాధులు ప్రబలుతుండడంతో జిల్లా ఆసుపత్రిలో మందులు, వైద్యులను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నాం. పేషెంట్లు ఏ సమయంలో వచ్చినా చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా వైరల్‌ ఫీవర్లు, డయేరియా బారిన పడుతున్నారు. చాలా మంది ఓపీ చూపించుకొని మందులు తీసుకెళ్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకొని చికిత్స అందిస్తున్నాం.

డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు