ఇక్కడి ప్రజల ఆదరణ మరచిపోలేనిది..

19 Nov, 2015 01:55 IST|Sakshi
ఇక్కడి ప్రజల ఆదరణ మరచిపోలేనిది..

రెండు రాష్ట్రాల్లో రాబోయే రోజులు మనవే..
రాజ్‌కుమార్ పార్టీలో చేరడం సంతోషకరం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి

 
 గీసుకొండ : గీసుకొండ మండల ప్రజలు చూపిస్తున్న ఆదరణను ఎన్నటికీ మరచిపోలేమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గీసుకొండ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెంట వచ్చిన ఆయన మాట్లాడారు. ఇక్కడి ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీకి మంచి రోజులు రానున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్ నాయకుడు వీరగోని రాజ్‌కుమార్  వైఎస్సార్‌సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో పరకాల ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ విజయమ్మ, షర్మిల  ఎన్నికల ప్రచారం చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ పార్టీలో చేరిన వీరగోని రాజ్‌కుమార్ మా ట్లాడుతూ ప్రజలకు జీతగాళ్లుగా పని చేయాల్సిన ప్రజా ప్రతినిధులు మద్యలో రాజీనామా చేస్తే వారిని పని దొంగలు అనాల్సి వస్తుందని పేర్కొన్నారు. పాలకుల అహంకారంతోనే ఈ ఎన్నికలు రాగా.. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓట్లు వేయాలని టీఆర్‌ఎస్ నేతలు  బెదిరిస్తున్నారని తెలిపారు.

నాడు వైఎస్సార్ నీడలో పని చేశామని, ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి నాయత్వంలో ముందుకు సాగుతూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. తనను తమ్ముడిగా ఆదరించి, తన వెంట వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరడానికి వచ్చిన వారికి ఈ సందర్బంగా రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రస్తుత ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. కాగా, రాజ్‌కుమార్ వెంట ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ మేరకు ఊకల్ ఎంపీటీసీ పులిచేరి మంజుల, గీసుకొండ ఎంపీటీసీ వీరగోని కవిత, గీసుకొండ పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్, పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలతో పాటు సుమారు ఆరు వేల మంది వైఎస్సార్ సీపీలో చేరినట్లు రాజ్‌కుమార్ తెలిపారు.
 
వృద్ధులను ఓటు అడిగిన జగన్‌మోహన్‌రెడ్డి
 రోనాయమాకులలో ఓ ఇంటి వద్ద ఆగి అక్కడి వృద్ధులు అమృతాబాయి, కమలమ్మ, రాధమ్మను వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పలకరించారు. తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
 
మంగళహారతులతో స్వాగతం..
 వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కోనాయమాకుల మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. గ్రామంలోని ముఖ్య కూడలి వద్ద ఆయన రాకను గమనించిన మహిళలు మంగళహారతులతో ఎదురువెళ్లారు. ఈ సందర్భంగా మహిళలతో జగన్‌మోహన్‌రెడ్డి ఆప్యాయంగా మాట్లాడారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
 

మరిన్ని వార్తలు