క్షమాపణలు చెప్పిన మంత్రి పువ్వాడ

12 Mar, 2020 12:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కార్మిక శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ గురువారం శాసన మండలిలో క్షమాపణలు చెప్పారు. ఆర్టీసీ అధికారులు... ప్రజా ప్రతినిధుల ఫోన్లు లిఫ్ట్‌ చేయకపోవడం, వారికి సమాచారం అందివ్వకపోవడం తప్పేనని ఆయన అంగీకరించారు. మండలిలో ఆర్టీసీపై మంత్రి పువ్వాడ మాట్లాడుతూ...ఆర్టీసీ పార్సిల్‌ సర్వీసుల ద్వారా సంవత్సరానికి రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. నెలాఖరుకు 100 కార్గో బస్సులు సిద్ధం చేస్తామని అన్నారు. ఆర్టీసీకి రోజుకు కోటిన్నర లాభం వస్తోందని, మంత్రి పేర్కొన్నారు.  గతంలో రూ. 11 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 12.50కోట్ల ఆదాయం వస్తుందన్నారు. గత రెండు నెలల నుంచి ఆర్టీసీ ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. 

ఆర్టీసీ సమ్మె కాలపు జీతాలు రూ. 235 కోట్లు చెల్లించడంపై ఆర్టీసీ జెఏసీ నాయకులే కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీసీఎస్‌ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం రూ. 600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగాలని అధికారులకు సూచించామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించామని, జూలై నాటికి రూ. 20 కోట్లతో ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన బస్టాండ్ నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా ఎమ్మెల్సీల సీడీసీ నిధుల కోసం అందరూ సభ్యులకు లేఖలు రాయాలని మంత్రికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. 

వరంగల్‌ను టూరిస్ట్ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ‘త్వరలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు. పర్యాటక ప్రదేశాల అభివృద్ధిలో నిర్లక్ష్యం లేదు. రామప్ప ఐలాండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాము. తెలంగాణలోని అనేక ప్రాంతాలను పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తోంది. బోగత, మేడారం, తాడ్వాయి, సోమశిల, నాగార్జున సాగర్ వద్ద కాటేజ్‌ల నిర్మాణం, బోటింగ్ సౌకర్యం కల్పించాం. భద్రాచలం రాముని కల్యాణం సందర్భంగా హెలికాప్టర్ సేవలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటాము’. అని పేర్కొన్నారు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా