ప్రజల సౌకర్యార్థమే రిసెప్షన్‌ సెంటర్‌

10 Mar, 2018 10:30 IST|Sakshi
నాలుగో టౌన్‌లో రిసెప్షన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న సీపీ కార్తికేయ

సీపీ కార్తికేయ

ఉమ్మడి జిల్లాలో తొలి సెంటర్‌ ప్రారంభం

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌): న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సౌకర్యార్థం రిసెప్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ కార్తికేయ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నాల్గోటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ రిసెప్షన్‌ సెంటర్‌ను సీపీ అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి, 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ పురుషోత్తం, పాంగ్రా గ్రామ సర్పంచ్‌ భీంసింగ్‌లతో కలిసి ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగానే నిజామాబాద్‌ జిల్లాలో మొదటి రిసెప్షన్‌ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని, ఇందుకు ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో మొదటి విడత కింద ఐదు రిసెప్షన్‌ సెంటర్లు మంజూరయ్యాయన్నారు. ఇం దులో నిజామాబాద్‌లో రిసెప్షన్‌ సెంటర్‌ను ప్రారంభం కాగా, ఆర్మూర్, నవీపేట్, మాక్లూర్‌ పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్‌ సెంటర్లు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయని, త్వరలోనే వీటిని కూడా ప్రారంభిస్తామని సీపీ తెలిపారు.

డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్‌ సెంటర్‌ నిర్మాణం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌హెచ్‌వో, ఎస్‌ఐ, సిబ్బంది, లాకప్‌ గదులు, లాకర్లు ఉంటాయి. అయితే పోలీస్‌స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే బాధితులకు ఒక గది ఉండాలని, అందుకు ప్రభుత్వం రిసెప్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తోందని సీపీ చెప్పారు. వివిధ పనుల కోసం స్టేషన్‌కు వచ్చేవారు స్టేషన్‌లో ఎస్‌ఐ లేకుంటే ఆయన వచ్చేంత వరకు స్టేషన్‌ బయట చెట్ల కింద పడిగాపులు కాసేవారన్నారు.వారు ఇబ్బందులు పడకుండా వచ్చిన పని పూర్తి అయ్యేంతవరకు రిసెప్షన్‌ సెంటర్‌లో వేచి ఉండేలా అన్ని వసతులు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. రిసెప్షన్‌ సెంటర్‌లో 15 నుంచి 20 మంది వరకు కూర్చునే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.

ఇందులో తాగునీటి, టీవీ, పేపర్లు, కు ర్చీలు ఏర్పాటు చేశామన్నారు. సెంటర్‌లో ఎస్‌ఐకు ప్రత్యేక గది, కంప్యూటర్‌ ఆపరేటర్లు, సిబ్బంది సేద తీరేందుకు ప్రత్యేక వసతులు కల్పించినట్లు పేర్కొ న్నారు. రిసెప్షన్‌ సెంటర్‌లో సిబ్బంది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారు మొదట రిసెప్షన్‌ సెంటర్‌లో సిబ్బందిని కలువాలని, వారు ఏ పనిమీద స్టేషన్‌కు వచ్చారో, స్టేషన్‌లో ఎవరిని కలుస్తే పని అవుతుందో సూచనలు చేస్తారని, అవసరం అనుకుంటేనే వారిని పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై వద్దకు పంపుతారని తెలిపారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు దశల వారిగా రిసెప్షన్‌ సెంటర్లు రానున్నాయని సీపీ కార్తికేయ తెలిపారు. కార్యక్రమంలో నగర సీఐ సుభాష్‌చంద్రబోస్, ఎస్‌ఐలు కృష్ణ, రుక్మావత్‌ శంకర్, ఆంజనేయులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.   

త్వరలోనే మోడల్‌ పీఎస్‌ను ప్రారంభిస్తాం..
జిల్లాలో తొలి మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు సీపీ కార్తికేయ తెలిపారు. నాలుగో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను మోడల్‌ పీఎస్‌గా తీర్చిదిద్దేందుకు పనులు కకొనసాగుతున్నాయన్నారు. వచ్చే రెండు వారాల్లో పనులు పూర్తి కాగానే దీనిని ప్రారంభించనున్నట్లు సీపీ తెలిపారు.   

మరిన్ని వార్తలు