కొడంగల్‌ ఫలితంపై జోరుగా బెట్టింగ్‌ 

9 Dec, 2018 14:22 IST|Sakshi

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య పోటీ ఉత్కంఠగా మారిన ఫలితం 

రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చోపచర్చలు

సాక్షి, కొడంగల్‌: కొడంగల్‌ అసెంబ్లీ స్థానంపై బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. రేవంత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి అభిమానులతోపాటు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతలు వేలు, లక్షల్లో బెట్టింగులు కాస్తున్నారు. రేవంత్‌రెడ్డి గెలుస్తారని కొందరు.. లేదు నరేందర్‌రెడ్డి విజయం సాధిస్తారని మరికొందరు పందేలు కాస్తున్నారు.

కొడంగల్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు ఎవరూ గెలువలేదు. గతంలో గురునాథ్‌రెడ్డి రెండు పర్యాయాలు గెలిచినా హాట్రిక్‌ సాధించలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి ఆయన కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగారు. మూడోసారి గెలిచి హాట్రిక్‌ సాధిస్తాననే ధీమాతో రేవంత్‌ ఉన్నారు.

రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షra, పరోక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు ఓడిపోలేదు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఆయన ఓటమి చూడలేదు. కాగా, ప్రస్తుతం కొడంగల్‌ ఎన్నికలు ఫలితం ఎవరికీ అంతుపట్టడం లేదు.

నెలరోజుల నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతోపాటు రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు సైతం బరిలోకి దిగి ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేశారు. నరేందర్‌రెడ్డి మంత్రి మహేందర్‌రెడ్డికి స్వయాన సోదరుడు కావడంతో ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని గులాబీ అధిష్టానం కంకణం కట్టుకుంది. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సహకారం తీసుకున్నారు. గెలుస్తామనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రాహుల్‌ గాంధీతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు సైతం ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి సైతం విజయంపై భరోసాతో ఉన్నారు. ఈనెల 11న ఫలితం వెలువడనుంది. ఈనేపథ్యంలో కొడంగల్‌ ఫలితంపై నేతలు బెట్టింగ్‌ కాస్తున్నారు.   

మరిన్ని వార్తలు