యురేనియం అన్వేషణపై పునరాలోచన?

28 Jul, 2019 02:46 IST|Sakshi

అమ్రాబాద్‌ అడవుల్లో నిక్షేపాలపై మళ్లీ ప్రతిపాదనలు.. 

నిక్షేపాల అన్వేషణ సర్వే సాధ్యం కాకపోవచ్చంటున్న అటవీ అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: యురేనియం నిల్వల అన్వేషణపై అటవీశాఖ పునరాలోచనలో పడిందా? ఈ ప్రశ్నలకు అధికారికవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అమ్రబాద్‌ అడవుల్లో నిక్షేపాల సర్వేపై మళ్లీ తాజా ప్రతిపాదనలు సమర్పిం చాలని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ (ఏఎండీ)కు కేంద్ర అటవీ సలహా మండలి, రాష్ట్రం కూడా సూచించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇది నిలిచిపోయినట్టేనని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2016లో ఆమోదించిన ప్రతిపాదనలకు భిన్నం గా కొత్త మార్గాల్లో డ్రిల్లింగ్‌ చేపట్టడం, సర్వే పరిధి కూడా ఎక్కువగా విస్తరించడం వల్ల ఏఎండీ కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభించడం, వాటి ప్రకారం సర్వేలు మొదలుపెట్టడం అసాధ్య మని ఉన్నతస్థాయి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

యురేనియం అన్వేషణకు గత మే నెలలో ఏఎండీకి కేంద్ర అటవీ సలహా మండలి అంగీకారం తెలిపిన నేపథ్యంలో సర్వే కోసం అడవి డ్రిల్లింగ్‌ మొదలుపెడితే పులుల అభయారణ్యంపై తీవ్ర ప్రభావంతోపాటు జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుందని ఆదివాసీలు, స్వచ్ఛందసంస్థలు, పర్యావరణ ప్రేమికులు ఆందో ళన వ్యక్తం చేశారు. దీంతో ఈ సర్వే ఏవిధంగా నిర్వహిస్తారు, ఎంపిక చేసిన ప్రదేశాల్లోకి డ్రిల్లింగ్‌ యంత్రాలను ఎలా తీసుకెళతారు, అక్కడి అడవికి, జీవరాశులకు ఏమేరకు నష్టం జరుగుతుంది తదితర అంశాలపై ఫారమ్‌–సీలోని నమూనాకు అనుగుణంగా తాజాగా ప్రతిపాదనలు పంపించాలని ఏఎండీని కేంద్ర అటవీ సలహా మండలి, రాష్ట్ర అటవీశాఖ కోరాయి. ఏఎండీ నుంచి ఆమ్రాబాద్‌ డీఎఫ్‌వోకు తాజా ప్రతిపాదనలు అందాక, వాటిని ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం డీఎఫ్‌వో ఇచ్చే నివేదికను బట్టి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఏఎండీ ప్రతిపాదనలు, డీఎఫ్‌వో నివేదికను రాష్ట్ర అటవీశాఖ పరిశీలించి, వాటిని కేంద్ర అటవీశాఖకు, కేంద్ర అటవీ సలహామండలికి పంపనుంది. దీనిపై కేంద్రస్థాయిలో తుదినిర్ణయం తీసుకుంటే యురేనియం అన్వేషణకు క్లియరెన్స్ లభించినట్టుగా భావించవచ్చని అధికారులు భావిస్తున్నారు.  

మొదట్లో ఏరియల్‌ సర్వే ఆలోచన... 
యురేనియం నిక్షేపాల అన్వేషణకు ఏరియల్‌ సర్వే చేపట్టడంతోపాటు డ్రోన్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఇతరత్రా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తామనేవిధంగా ఏఎండీ తొలుత సమర్పించిన ప్రతిపాదనలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 2016లో రాష్ట్ర అటవీ సలహామండలికి ప్రతిపాదనలు సమర్పించినప్పుడు కూడా యురేనియం నిల్వల అన్వేషణ కోసం నిర్వహించే సర్వేలో ఎలాంటి డ్రిల్లింగ్‌ నిర్వహించబోమని, అటవీ విధ్వంసం వంటిది జరగదని ఏఎండీ స్పష్టం చేసింది.  గతంలో డ్రిల్లింగ్‌ ఉండదన్న హామీకి భిన్నంగా ఇప్పుడు ఈ సర్వేల్లో 250 అడుగులు అంతకంటే ఎక్కువ లోతుల్లోకి 4 వేల వరకు బోర్లు వేస్తారనే తాజా ప్రతిపాదనలు రావడంపట్ల ఆదివాసీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక ఆలోచనలు  మారిపోయిన కారణంగా స్వతంత్ర సంస్థ ద్వారా అధ్యయనం చేయించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. 

>
మరిన్ని వార్తలు