క్యాచ్‌ ద ట్రాప్‌..! 

2 Dec, 2023 03:23 IST|Sakshi

వన్యప్రాణుల వేట నిరోధానికి అటవీ శాఖ స్పెషల్‌ డ్రైవ్‌ 

అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్‌ వైర్లు, పేలుడు పదార్ధాలు ఉపయోగించకుండా చర్యలు 

అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు 

వేటగాళ్ల సమాచారం తెలిస్తే అధికారులకు చెప్పేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్‌ డ్రైవ్‌ ‘క్యాచ్‌ ద ట్రాప్‌’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్‌ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్‌ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే.  

వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్‌ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు.

గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా­్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్‌/పరికరాలు సరిగ్గా రికార్డ్‌ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్‌కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తు­న్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. 

వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్‌ఫార్మర్‌లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు.  చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్‌కు, లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది..  
 

మరిన్ని వార్తలు