మళ్లీ పులి భయం

14 Dec, 2023 04:51 IST|Sakshi

ఏటా ఇదే సీజన్‌లో భయపెడుతున్న టైగర్‌

నందిగూడ శివారులో పశువును చంపి.. కాపరిపై దాడి

పత్తి చేన్లకు వెళ్లాలంటే జంకుతున్న స్థానికులు 

అటవీ సమీప ప్రాంతాల వరకు పులి సంచారం

పులి భయం మళ్లీ మొదలైంది. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం నందిగూడ అటవీ ప్రాంత శివారులో రెండురోజుల కిందట పశువును చంపేసి.. పశువుల కాపరి గులాబ్‌పై దాడి చేసిన ఘటన దరిమిలా ఆ ప్రాంత సమీప ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ఆ ఘటనలో గులాబ్‌ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలతో బయటపడగా, చేతికి గాయాలయ్యాయి. ప్రతీ ఏడాది పత్తి తీసే ఇదే సీజన్‌లోనే పులుల సంచారం పెరుగుతోంది. దీంతో పత్తి చేన్లకు వెళ్లాలన్నా, జీవాలను మేతకు తీసుకెళ్లాలన్నా కాపర్లు జంకుతున్నారు. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాల

మూడేళ్లుగా మనుషులపై దాడులు
గత మూడేళ్లుగా నవంబర్‌ నుంచి జనవరి మధ్యే పులుల దాడులు అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా 2020 నవంబర్‌ 11న ఏ2 అనే పులి కుమురంభీం జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్‌(21) పత్తి చేనుకు వెళ్తుండగా దాడి చేసి చంపేసింది. అదే నెల 29న పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(18)ను పొట్టన పెట్టుకుంది.

కేవలం మూడు వారాల వ్యవ«ధిలోనే ఇద్దరి మృతితో స్థానికుల నుంచి నిరసనలు వచ్చాయి. దాంతో అటవీ శాఖ సీరియస్‌గా తీసుకుని ఆ పులిని బంధించే ప్రయత్నం చేసినా.. సాధ్యపడలేదు. ఆ తర్వాత పులి మహారాష్ట్ర వైపు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ గతేడాది నవంబర్‌లోనే కుమురంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము(69)ను పత్తి చేనులో ఉండగా దాడి చేసి చంపేసింది. తాజాగా పశువుల కాపరిపై దాడి జరిగింది. 

బఫర్‌ జోన్‌లోనే సంచారం 
ఉమ్మడి ఆదిలాబాద్‌ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు.. పులుల రాకపోకలకు ప్రధాన కారిడార్‌గా ఉంది. ఆదిలాబాద్‌ నుంచి ఆసిఫాబాద్, మంచిర్యాల వరకు పులుల సంచారం ఉంటోంది. పెన్‌గంగా, ప్రాణహిత తీరాలు దాటి తిప్పేశ్వర్, తడోబా టైగర్‌ రిజర్వ్‌ పులుల అభయారణ్యాల నుంచి వలస వస్తుంటాయి. ఎనిమిదేళ్ల క్రితం పాల్గుణ అనే ఆడపులి కాగజ్‌నగర్‌లోనే స్థిర నివాసం ఉండటంతో సంతతి పెరిగింది. ఇలా అనేక పులులు ఒక్కొక్కటిగా తెలంగాణ భూభాగంలో ఆవాసం, తోడు వెతుక్కుంటూ అడుగుపెడుతున్నాయి.

టైగర్‌ రిజర్వు పరిధి కోర్‌ ఏరియా మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్‌ కవ్వాల్‌లో మాత్రం ఇప్పటికీ ఒక్క పులి కూడా స్థిరంగా ఉండలేదు. కేవలం బఫర్‌ ప్రాంతాల్లోనే పులులు సంచరించడంతో సమస్య మొదలవుతోంది. ఆ ప్రాంతాల్లోనే పత్తి చేన్లు, మానవ సంచారం ఉండడంతో ఎదురుపడిన సందర్భంలో దాడి చేస్తున్నాయి. నిత్యం ఆదిలాబాద్‌ డివిజన్‌లో తాంసి, భీంపూర్, ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ డివిజన్‌లో దహెగాం, పెంచికల్‌పేట, బెజ్జూరు, బెల్లంపల్లి, చెన్నూరు డివిజన్ల వరకు పులులు తిరుగుతుంటాయి.

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు పిప్పల్‌కోట్, కాగజ్‌నగర్‌ డివిజన్‌ అడవుల్లో అనేకసార్లు స్థానికులకు పులులు ఎదురుపడ్డాయి. అడవిలో వన్యప్రాణుల కంటే సులువుగా దొరికే మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెల పైనే దాడి చేస్తూ ఆకలి తీర్చుకుంటున్నాయి. అలా పశువులు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అటవీ శాఖ చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు మనుషులపై దాడి చేయడమే ఆందోళన కలిగిస్తోంది.

జత కట్టే సమయంలో? 
పులులు జత కట్టే సమయం నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్యే కావడం, తోడు, ఆవాసం కోసం తోటి పులుల మధ్య ఆధిపత్య పోరు, వాగులు, నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్న చోట సంచరిస్తూ అనుకోకుండా మనుషులు ఎదురుపడితే దాడులకు ప్ర«ధాన కారణమవుతున్నాయని అటవీశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు