రోడ్లకు సొబగులు

20 Jun, 2019 11:02 IST|Sakshi

లేన్‌ మార్కింగ్‌లు.. స్టాప్‌లైన్లు

పాదచారుల భద్రతకు ప్రాధాన్యం

అడ్డగోలుగా చలాన్లు పడకుండా సౌకర్యాలు

తొలివిడతలో 50 కి.మీ.లకు రూ.2.68 కోట్ల ఖర్చు  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రజలు రోడ్డు దాటాల్సిన చోట జీబ్రా లేన్లు.. పెద్ద, చిన్న వాహనాల ప్రయాణానికి సదుపాయంగా లేన్‌ మార్కింగ్‌లు..ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్లు లేవు. స్టాప్‌లైన్లు సరిగ్గా లేకున్నా.. ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదాలు చెలరేగుతున్నాయి. దీనికి తోడు పాత రోడ్లకే కాకుండా కొత్తగా నిర్మిస్తున్న రోడ్లపై కూడా లేన్‌ మార్కింగ్‌లు చేయడం లేదు.  ఇటీవల జరిగిన రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో, ఆర్‌అండ్‌బీ మంత్రి సూచనల మేరకు గ్రేటర్‌ నగరంలోని అన్ని రోడ్లపై లేన్‌ మార్కింగ్‌లు, స్టాప్‌లైన్లు తదితరమైనవి వేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. తొలి విడతగా దాదాపు 50 కి.మీ.ల మేర రోడ్లకు మార్కింగ్‌లు వేయనుండగా  ఇప్పటికే కొన్ని చోట్ల  పనులు ప్రారంభించారు. దాదాపు 15 కి.మీ.ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా 35  కి.మీ.ల మార్గాల్లో  పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ లేన్లు మన్నికగా ఉండేందుకు థర్మోప్లాస్టిక్‌  పెయింట్‌ను బీటీ రోడ్లపై తెలుపు గీతలతో, సీసీ రోడ్లపై పసుపు రంగులో వేస్తున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వేస్తే ఎండవేడిమికి బీటీపైనున్న నలుపు వాహనాల ప్రయాణాలతో  తెలుపు గీతలకు అంటుకుని  నల్లగా మారే అవకాశం ఉందని, ఇప్పుడిప్పుడే నగరంలో ఎండలు తగ్గినందున ఈ పనులకు ఇదే సరైన సమయమని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌ జియాఉద్దీన్‌ తెలిపారు. పాదచారుల భద్రత ప్రధాన లక్ష్యంగా ఈ పనులు చేస్తున్నామన్నారు. మొత్తం 17 పనులుగా విభజించి లేన్‌మార్కింగ్‌ పనులు చేస్తున్నారు.ఇవి పూర్తయ్యాక మిగతా ప్రాంతాల్లో చేపట్టనున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 1, 10   జంక్షన్, జహ్రానగర్‌ జంక్షన్, బీఎన్‌రెడ్డి నగర్, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయన్నారు. 

సెంట్రల్‌ మీడియన్లు..రెయిలింగ్‌లు..
కేవలం కొత్తరోడ్లపైనే కాక జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని రోడ్లకూ ఈ పనులు చేస్తామని చెప్పారు.  దీంతోపాటు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు దాటకుండా ఉండేందుకు  కొన్ని ప్రాంతాల్లో సెంట్రల్‌ మీడియన్లకు రెయిలింగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ , తదితర మార్గాల్లో ఈపనులు చేపట్టినట్లు చెప్పారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బీటీ పొరలుపొరలుగా వేయడంతో  రోడ్ల ఎత్తు బాగా పెరిగి సెంట్రల్‌ మీడియన్లు  పైకి కనిపించకుండా కుంచించుకుపోయాయి. అలాంటి మార్గాల్లో సెంట్రల్‌ మీడియన్ల ఏర్పాటు పనులకు కూడా సిద్ధమయ్యారు. ప్రస్తుతం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ గుడి వద్ద నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ మీదుగా హిందీ మహా విద్యాలయ వరకు ఈ పనులకు సిద్ధమయ్యారు. 

మరిన్ని వార్తలు