ఐదోరోజు.. అదే ఆందోళన

10 Oct, 2019 11:26 IST|Sakshi

సాక్షి, హుజూరాబాద్‌ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని.. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. వేతన సవరణ చేపట్టాలని.. ఉద్యోగ ఖాళీలు భర్తీచేయాలనే.. తదితర 26డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. రోజులు గడుస్తున్నకొద్ది కార్మికులు సమ్మెను ఉధృతం చేస్తున్నారు. కరీంనగర్‌లోని బస్టాండ్లో, వన్, టూ డిపోల ఎదుట కార్మికులు పెద్ద ఎత్తును నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్లకార్టులు చేతబట్టి సమ్మెకు ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

పండగపూట ప్రభుత్వం చర్యలు
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లో చేర్చుకొని దసరా పండుగపూట రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించారు. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో 10డిపోల్లో 849 ఆర్టీసీ బస్సుల్లో 299 నడిపించారు. 195 అద్దె బస్సుల్లో ప్రయాణికులను చేరవేశారు. ఇందుకోసం 300 మంది డ్రైవర్లను, 300 మంది కండక్టర్లను తాత్కాలికంగా నియమించారు. అయినప్పటికీ ప్రధాన రూట్లలోనే బస్సులు నడుస్తుండడంతో పల్లెప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సందట్లో.. సడేమియా..
డ్రైవర్లు అధిక స్పీడ్‌తో వాహనాలు నడుపుతున్నారని, కండక్టర్లు టికెట్లు ఇవ్వకుండానే ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సమ్మెను దృష్టిపెట్టుకొని సందట్లో సడేమియాలాగా క్యాబ్‌లు, ఆటోలు ఇష్టానుసారంగా డబ్బులు వసూలుకు పాల్పడుతున్నారు. క్యాబ్‌ డ్రైవర్లయితే కరీంనగర్‌ నుంచి సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌కు రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. బతుకమ్మ పండుగ రోజు రూ.500 వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఇక మారుమూల పల్లెలకు బస్సులు బంద్‌ కావడంతో ఆటోల హవా కొనసాగుతోంది. రూ.20కి బదులు రూ.50 దాకా చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు.

హుజూరాబాద్‌ డిపోలో రోజుకు రూ.7లక్షలు నష్టం
ఆర్టీసీ సమ్మెతో హుజూరాబాద్‌ డిపోకు రోజుకు రూ. 07లక్షల నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.డిపోలో 310మంది ఉద్యోగులుండగా 110మంది డ్రైవర్లు, 123మంది కండక్టర్లు సమ్మెలో ఉన్నారు.బుధవారం ఐదో రోజు డిపో ఎదురుగా రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. డిపోలో 57 బస్సులు ఉండగా, 10 అద్దె బస్సులు ఉన్నాయి. పోలీస్‌ పహారా మధ్య 42బస్సులు నడిచాయి.

కదం తొక్కిన కార్మికులు
హుజూరాబాద్‌లో దాదాపు 200 మంది ఆర్టీసీ కార్మికులు స్థానిక డిపో నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. గంట పాటు కరీంనగర్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు ముక్కెర రాజు, జేఏసీ నాయకులు ఆవునూరి సమ్మయ్య, పల్కల ఈశ్వర్‌రెడ్డి, వంగల హన్మంత్‌గౌడ్, వేల్పుల రత్నం, వెంకటప్రసాద్, పాక సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా