2న బస్సుల దిగ్బంధం

30 Mar, 2015 02:25 IST|Sakshi
2న బస్సుల దిగ్బంధం

ఆర్టీసీ కార్మికుల పోరుబాట
వేతన సవరణకోసం డిమాండ్
బస్‌భవన్ ముట్టడికి నిర్ణయం
పదోతరగతి విద్యార్థులకు ఇబ్బంది

 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పడుతున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేసేందుకు గుర్తింపు పొందిన సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్లు ఏప్రిల్ 2న బస్‌భవన్ ముట్టడి నిర్వహించాలని నిర్ణయించాయి. దాదాపు 20 వేల మంది కార్మికులతో సుందరయ్య భవన్ నుంచి ఆర్టీసీ భవన్ వరకు ర్యాలీగా వచ్చి కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించాయి. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యేలా దిగ్బంధం చేయబోతున్నారు. దీంతో పరీక్షలు రాస్తున్న పదో తరగతి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే దానికి యాజమాన్యమే బాధ్యత వహించాలని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో ఆందోళనకు గురవుతున్న అధికారులు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కార్మిక సంఘాలను కోరుతున్నారు. కానీ తాము ఎట్టిపరిస్థితిలోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. నిజానికి అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ, పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏప్రిల్ రెండుకు కార్యాచరణను వాయిదా వేసుకున్నారు. ఆ రోజు బహిరంగసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంటామని కార్మిక నేతలు పేర్కొంటున్నారు.

 ఎన్‌ఎంయూ నిరాహారదీక్షలు..
 వేతన సవరణ, ఆర్టీసీ విభజన ప్రధాన డిమాండ్లుగా ఎన్‌ఎంయూ సోమ, మంగళవారాల్లో ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలు నిర్వహించనుంది. తమ డిమాండ్లపై యాజమాన్యం స్పందించటం లేదని, గుర్తింపు సంఘాలు గందరగోళంగా వ్యవహరిస్తున్నాయని ఎన్‌ఎంయూ రెండు రాష్ట్రాల ప్రతినిధులు నరేందర్, రమేశ్, చెన్నారెడ్డి, శ్రీనివాసరావు, చంద్రయ్య, రమణారెడ్డిలు ఓ ప్రకటనలో ఆరోపించారు. సమ్మె నోటీసులు ఇచ్చి వాటి గడువు ముగిసేదాక కాలయాపన చేసి ఇప్పుడు బస్‌భవన్ ముట్టడి పేర గుర్తింపు సంఘాలు అయోమయానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు.

 సామూహిక సెలవులో వెళ్లాలని అధికారుల నిర్ణయం
 ఆర్టీసీ విభజనలో జరుగుతున్న జాప్యంతో విసిగిపోయిన తెలంగాణ అధికారులు ఆందోళనకు సిద్ధమయ్యారు. సంస్థ విభజనపై ప్రకటనలు తప్ప ఎలాంటి కసరత్తు జరగకపోవడంతో అధికారులు, సూపర్‌వైజర్ స్థాయి సిబ్బంది సామూహిక సెలవులో వెళ్లాలని నిర్ణయించారు. ఆదివారం ఆర్టీసీ తెలంగాణ అధికారుల సంఘం, సూపర్‌వైజర్ల సంఘ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఇందులో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేశారు. వచ్చే నాలుగైదు రోజుల్లో విభజన పరిణామాలు పరిశీలించి తగిన స్పందన రాకపోతే ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ స్థాయి నుంచి డిపో సూపర్‌వైజర్ వరకు సామూహిక సెలవులో వెళ్లాలని తీర్మానించారు. విభజన జరగనప్పటికీ తెలంగాణలో ‘తెలంగాణ ఆర్టీసీ’ అంటూ ఉంచిన బోర్డులను తిరిగి ‘ఏపీఎస్ ఆర్టీసీ’గా మార్చాలని నిర్ణయించారు. విభజన జరగకపోవటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఉద్యోగులందరికీ వివరించి ఆందోళనకు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అప్పటికీ చలనం రాకుంటే బస్‌భవన్‌ను ముట్టడించాలని తీర్మానిం చారు. దీనికి సంబంధించి రెండుమూడు రోజుల్లో తేదీలు ప్రకటించనున్నట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు