సాక్షరభారత్‌ వ్యవస్థకు మంగళం

7 Jul, 2018 11:59 IST|Sakshi
నిరసన తెలుపుతున్న సాక్షరభారత్‌ మండల, గ్రామ కోఆర్డినేటర్లు (ఫైల్‌)

నేరడిగొండ(బోథ్‌): సాక్షర భారత్‌ వ్యవస్థకు మంగళం పాడడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పథకం మార్పుకు సంబంధించిన ఉత్తర్వుల జారీపై వయోజన విద్య సంచాలకులకు సంకేతాలు కూడా అందినట్లు తెలుస్తోంది. 2009లో అప్పటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులుగా ఉన్న వయోజనులు అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా సాక్షరభారత్‌ మండల, గ్రామ కోఆర్డినేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో సాక్షర భారత్‌ సెంటర్లను ప్రారంభించి, ఫర్నిచర్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు వంటి సదుపాయాలు కల్పించింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఇద్దరు చొప్పున చదువుకున్న స్థానికులైన నిరుద్యోగులను గ్రామ కోఆర్డినేటర్లుగా, మండల కోఆర్డినేటర్‌గా నియమించింది. వారు ప్రతిరోజు ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 9గంటల వరకు వయోజనులను అక్షరాస్యులుగా తయారు చేయడానికి విధులు నిర్వర్తించారు. ఇప్పటికే వారికి రెండేళ్లుగా వేతనాలు ఇవ్వక, విధులు కల్పించకపోవడంతో కోఆర్డినేటర్లంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ఆందోళనలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోఆర్డినేటర్ల కొనసాగింపుపై ఎలాంటి హామీ రాలేదు. ఈ క్రమంలో సాక్షరభారత్‌ స్థానంలో ‘పడ్‌నా.. లిఖ్‌నా అభియాన్‌’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహణ..
త్వరలో ప్రారంభించనున్న కొత్త పథకాన్ని 2020 మార్చి వరకు కొనసాగించే విధంగా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొత్తగా అమలు చేయనున్న పడ్‌నా.. లిఖ్‌నా అభియాన్‌ పథకంలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బాధ్యతలను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అప్పగించనున్నట్లు సమాచారం.
 
కోఆర్డినేటర్ల ఆందోళన..
వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నియమించిన సాక్షరభారత్‌ కోఆర్డినేటర్ల భవిష్యత్‌ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 866 గ్రామపంచాయతీల్లో ఇద్దరు చొప్పున 1732 మంది కోఆర్డినేటర్లు, 52 మండలాలకు ఒక్కొక్కరు చొప్పున 52 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. ప్రతినెల గౌరవ వేతనంగా గ్రామ కోఆర్డినేటర్లకు రూ.2వేలు, మండల కోఆర్డినేటర్లకు రూ.6వేల గౌరవ వేతనం చెల్లించారు. నాలుగు, ఐదు నెలలకు ఒక్కసారి వచ్చిన వేతనాలతో తమ కుటుంబాలను పోషించుకున్న తమను తొలగిస్తే పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో కోఆర్డినేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తమకు ఏ రంగంలోనైనా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి కల్పించాలని ఆయా గ్రామాలు, మండలాల కోఆర్డినేటర్లు కోరుతున్నారు.
 
ఆశించిన ఫలితం రాకపోవడం వల్లనే..
సాక్షర భారత్‌ పథకం ప్రారంభంలో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ రాను రాను డీలా పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సంబంధిత ఉన్నతస్థాయి అధికారులు పర్యవేక్షించకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో కోఆర్డినేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా ప్రయోజనం ఉండడం లేదని కేంద్రం గ్రహించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గత నెల రోజుల క్రితమే సాక్షరభారత్‌ సేవలను నిలిపివేసినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు