తీవ్ర ఆందోళనలు.. శ్రీనగర్‌ నిట్​ మూసివేత, ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు

1 Dec, 2023 11:25 IST|Sakshi

శ్రీనగర్:​ జమ్మూకశ్మీర్​ శ్రీనగర్​ నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీని (ఎన్​ఐటీ) అధికారులు మూసివేశారు. ఓ విద్యార్థి మతపరమైన అంశంపై సోషల్​ మీడియాలో ఓ పోస్టు చేయడంతో నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనగు దిగారు. దీంతో ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలు ఇతర విద్యాసంస్థలకు కూడా వ్యాపించాయి.  అప్రమత్తమైన ఎన్​ఐటీ అధికారులు విద్యార్ధులకు శీతాకాల సెలవులను ముందుగానే ప్రకటించారు.

గురువారం నుంచే సెలవులు అమల్లోకి వస్తామని యూనివర్సిటీ డీన్​ ఉత్తర్వులు జారీ చేశారు. స్టూడెంట్స్​ అందరిని తక్షణమే  క్యాంపస్​, హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు.  నిట్​ వెబ్​సైట్​ను తాత్కాలికంగా మూసివేశారు. కశ్మీర్‌లోని ఇతర డిగ్రీ కాలేజీలు కూడా శనివారం నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. డిసెంబర్​ 20లోగా పరీక్షలు ఉండగా,.. వాటిని వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను సెలవుల అనంతరం నిర్వహిస్తామని వెల్లడించారు.

అయితే ఉన్నట్టుండి హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఎన్​ఐటీలో చదువుతున్న దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్ ​నుంచి అత్యవసరంగా బయలుదేరేందుకు విమానాలు, రైలు సదుపాయం లేకపోవడంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

మరోవైపు స్థానికేతర నిట్వి​ ద్యార్థి సోషల్ మీడియాలో దైవదూషణతో కూడిన పోస్ట్ చేయడంతో మంగళవారం ఈ వివాదం చెలరేగింది. ఇది ఇన్‌స్టిట్యూట్‌లో భారీ నిరసనలకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అభ్యంతరకరమైన పోస్టు  చేసి ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమైన యూట్యూబ్​ వీడియోను పోస్టు చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు శ్రీనగర్​ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు