పట్నంలో పోటీకి ఓకే

17 Nov, 2018 15:47 IST|Sakshi
క్యామ మల్లేష్‌తో మాట్లాడుతున్న సామ రంగారెడ్డి

నిర్ణయం మార్చుకున్న సామ రంగారెడ్డి 

స్వతంత్ర అభ్యర్థిగా మల్‌రెడ్డి రంగారెడ్డి

సాక్షి, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం స్థానం నుంచి పోటీ చేసేందుకు సామ రంగారెడ్డి అంగీకరించారు. మొదటి నుంచి ఎల్‌బీనగర్‌లో పోటీ చేయాలని ఆయన ఆసక్తి కనబరిచినా కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు కాంగ్రెస్‌ ఖాతాలోకి పోయింది. దీంతో ఇబ్రహీంపట్నం సీటు టీడీపీకి దక్కింది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. అయితే, పట్నంలో పోటీచేసేందుకు రంగారెడ్డి ససేమిరా అన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడేందుకు అమరావతికి వెళ్లారు. బాబు బుజ్జగింపులతో మొత్తబడ్డ ఆయన ఎట్టకేలకు పోటీకి అంగీకారం తెలిపారు. కాగా, ఈ టికెట్‌ను ఆశించి భంగపడ్డ రొక్కం భీంరెడ్డికి నచ్చజెప్పి రెబల్‌గా నిలబడకుండా టీడీపీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు.
 
క్యామ మల్లేష్‌తో సామ భేటీ 
కాంగ్రెస్‌ పార్టీలో మల్‌రెడ్డి రంగారెడ్డికి ప్రత్యర్థిగా నిలిచిన డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌తో టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. తనకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. అయితే, తనకు అన్యాయం చేసిన పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వ్యతిరేకం తప్ప మహాకూటమికి కాదని మల్లేష్‌ తెలిపారు. తన సంపూర్ణ మద్దతు ఉంటుందని సామ రంగారెడ్డికి చెప్పారు. 

స్వతంత్ర అభ్యర్థిగా మల్‌రెడ్డి! 
పట్టు వదలకుండా ఢిల్లీలో తిష్టవేసి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పైరవీలు చేస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డి తనకు టికెట్‌ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. అయితే మల్‌రెడ్డి బరిలో ఉంటే క్యామ మల్లేష్‌ కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని వార్తలు