బాలికపై అత్యాచారయత్నం సినిమా కథే

25 Jan, 2020 04:03 IST|Sakshi
సందీప్‌తో కలసి బైక్‌పై వెళుతున్న బాలిక (సీసీ కెమెరా దృశ్యం)

సీసీ కెమెరాల ద్వారా వెల్లడైన అసలు విషయం

పటాన్‌చెరు టౌన్‌: బాలికను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి అత్యచారయత్నం చేశారన్న ఘటనలో వాస్తవం లేదని తేలింది. గురువారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించగా ఆ బాలిక చెప్పింది అంతా కట్టుకథ అని తెలిసింది. శుక్రవారం అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గోపాలపురం గ్రామం నుంచి వచ్చిన ఓ వ్యక్తి అమీన్‌పూర్‌ పరిధిలోని వాణినగర్‌ కాలనీలో నివాసం ఉంటూ వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు.

10 రోజుల క్రితం ఊరి నుంచి అతని కూతురు (16) అమీన్‌పూర్‌కు వచ్చింది.  ఆ బాలిక మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లింది. అక్కడ బాలికకు సందీప్‌ అనే వ్యక్తితో పరిచయమైంది. వీరిద్దరూ కలసి గురువారం ఉదయం  కలసి మియాపూర్‌లో సినిమాకు వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం బైక్‌పై తిరిగి వస్తుండగా.. బాలికకు తల్లి ఫోన్‌ చేసి, ఎక్కడున్నావ్‌.. అని అడగడంతో తాను సినిమాకు వెళ్లిన విషయందాచి, తనను ఎవరో నలుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్‌ చేసి, అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ చెప్పింది. అయితే సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ అసలు విషయం బయటపడింది. ఆ బాలిక ఫొటోలు సామాజిక మధ్యమాల్లో వైరల్‌ చేసినందుకు ఇంటి యజమాని, బాలికను తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాకు తీసుకెళ్లిన సందీప్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు