హెరిటేజ్‌ తెలంగాణతో సర్వతో‘భద్రం’

15 May, 2018 01:43 IST|Sakshi
భూపాలపల్లి జిల్లా నయన్‌పాకలోని పురాతన సర్వతోభద్ర ఆలయం

పునర్నిర్మాణ బాధ్యత నుంచి దేవాదాయ శాఖ ఔట్‌

‘సాక్షి’ కథనంతో స్పందించిన సర్కారు

హెరిటేజ్‌ తెలంగాణకు సర్వతోభద్ర ఆలయ బాధ్యతలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే ప్రత్యేక చారిత్రక నిర్మాణంగా గుర్తింపు పొందిన సర్వతోభద్ర ఆలయ పునర్నిర్మాణ బాధ్యత నుంచి ప్రభుత్వం దేవాదాయ శాఖను తప్పించింది. ఆలయ ప్రత్యేకతలను దెబ్బతీసేలా దేవాదాయ శాఖ పనులు చేస్తుండటాన్ని ‘సాక్షి’వెలుగులోకి తేవడంతో.. సర్కారు స్పందించింది. ఈ పనులను హెరిటేజ్‌ తెలంగాణ (రాష్ట్ర పురావస్తు విభాగం)కు అప్పగించింది. ఈ పనుల కోసం దేవాదాయ శాఖకు మంజూరు చేసిన నిధులను కూడా పురావస్తు శాఖకే అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఈ ఆలయ విశిష్టత దెబ్బతినకుండా.. పూర్తిగా రాతి నిర్మాణాలతో పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు పురావస్తుశాఖ సిద్ధమైంది. 

ఆలయానికి దూరంగా ఆర్కేడ్‌ 
భూపాలపల్లి జిల్లా నయన్‌పాక గ్రామంలో పురాతన సర్వతోభద్ర ఆలయాన్ని ఇటీవల గుర్తించిన విషయం తెలిసిందే. దానిని పునరుద్ధరించి పునర్వైభవం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి.. దేవాదాయ శాఖకు బాధ్యత అప్పగించింది. కానీ దేవాదాయ శాఖ అధికారులు పురాతన ఆలయ విశిష్టతనే దెబ్బతీసేలా రాళ్ల తొలగింపు, కాంక్రీటుతో పనుల వంటివి చేపట్టారు. ఈ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ ‘సాక్షి’ఇటీవల కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన సర్కారు పునరుద్ధరణ బాధ్యతలను దేవాదాయ శాఖ నుంచి తప్పించి.. హెరిటేజ్‌ తెలంగాణకు అప్పగించింది. 

చర్యలు చేపట్టిన పురావస్తు శాఖ 
సర్వతోభద్ర ఆలయం అతి పురాతన నిర్మాణం కావడంతో.. దాని ప్రత్యేకత దెబ్బతినేలా, దాన్ని అనుకుని కొత్త నిర్మాణాలేవీ చేపట్టడానికి వీలు లేదు. దీంతో ప్రధాన ఆలయానికి చుట్టూ 60 అడుగుల దూరంలో చతురస్రాకారంలో భారీ ఆర్కేడ్‌ (మంటపం తరహాలో) నిర్మించాలని పురావస్తు శాఖ అధికారులు యోచిస్తున్నారు. అది కూడా పూర్తిగా రాతి నిర్మాణంగా ఉండనుంది. ఆలయానికి నాలుగు వైపులా ద్వారాలు ఉన్నందున ఆర్కేడ్‌ నాలుగు వైపులా ప్రత్యేక బాటలు ఏర్పాటు చేస్తారు. మధ్యలో పచ్చిక బయలు, పూల చెట్లు ఏర్పాటు చేస్తారు.

ఇక ఈశాన్య దిశలో ఉన్న కోనేరులో పూడిక తీసి పునరుద్ధరిస్తారు. ఇక ఆర్కేడ్‌ వెలుపల భక్తులు, పర్యాటకుల వసతి కోసం ఇతర నిర్మాణాలను చేపడతారు. ఇక ఆలయ శిఖరంపై భాగాన ఇటుకలు పడిపోయి ఉన్నాయి. దీంతో అదే పరిమాణంలో కొత్త ఇటుకలు తయారు చేయించి.. శిథిలమైన చోట ఏర్పాటు చేసి, డంగుసున్నంతో పునరుద్ధరించ నున్నారు.

మరిన్ని వార్తలు