లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలి

24 Jun, 2014 20:33 IST|Sakshi
లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరగాలి

హన్మకొండ: బ్యాంకుల ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరగాలని అర్థక్రాంతి సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ అన్నారు. హన్మకొండ కిషన్‌పురలోని వాగ్దేవి కాలేజీలో ఫోరం ఫర్ బెటర్, వరంగల్ మహిళ పతాంజలి యోగా సమితి, వరంగల్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ‘అర్థక్రాంతి’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారా జరపడం వల్ల బ్యాంకులే 2 శాతం లావాదేవీ పన్ను వసూలు చేస్తాయన్నారు.

దేశం మొత్తమ్మీద ప్రజలు కట్టే పన్ను ఇదొక్కటే కాబట్టి వినియోగదారుని ఖాతా నుంచి బ్యాంకులు ఈ పన్నును మినహాయించి ప్రభుత్వానికి కట్టేస్తాయన్నారు. ఎగుమతి, దిగుమతి పన్నులు మినహాయించి అన్ని రకాల పన్నులను పూర్తిగా రద్దు చేయడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. అంతేకాకుండా రూ.2 వేల లోపు లావాదేవీలు మాత్రమే నగదు రూపంలో జరగాలని, అంతకుమించిన లావాదేవీలు పూర్తిగా బ్యాంకుల ద్వారానే జరిగేలా ప్రభుత్వం నియంత్రించాలని అన్నారు. దీనిద్వారా దేశంలోని అవినీతినికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు.

ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ భారతదేశం వంటి ప్రజాస్వామికవ్యవస్థలో అర్థక్రాంతి అమలు చేయడం సాధ్యమేనన్నారు. సదస్సులో ఫోరం ఫర్ బెటర్ అధ్యక్షుడు సుధాకర్, వరంగల్ మహిళా పతంజలి యోగా సమితి అధ్యక్షురాలు సునీత, వరంగల్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జోషి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు