ఆమ్యామ్యాలు అక్కర్లే!

19 Jul, 2018 12:33 IST|Sakshi

భవన నిర్మాణ ప్లాన్లకు ఇక సెల్ఫ్‌ చెకింగ్‌ 

త్వరలో ప్రత్యేక వెబ్‌ అప్లికేషన్‌  

ప్లాన్‌ సరిగ్గా ఉన్నదీ లేనిదీ ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు 

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, డీటీసీపీ పరిధుల్లో వర్తింపు

సాక్షి, హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ ద్వారానే భవన నిర్మాణ దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీని అమల్లోకి తెచ్చినప్పటికీ, సంబంధిత ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఆగలేదు. వివిధ కొర్రీలతో అనుమతుల జారీలో జాప్యం చేస్తూ.. చేతులు తడిపితేనే దరఖాస్తులకు అనుమతులిస్తున్నారు. వీటిల్లో నిర్మాణ ప్లాన్‌లో లోపాలు.. షార్ట్‌ఫాల్స్‌ ఉన్నాయంటూ నిరాకరిస్తున్నారు. లోపాలు సరిదిద్ది తిరిగి రివైజ్‌ ప్లాన్‌తో దరఖాస్తు చేసుకోమంటున్నారు. జీహెచ్‌ఎంసీలో ఏటా దాదాపు పదివేల ఇళ్లకు అనుమతులిస్తుండగా, వాటిల్లో దాదాపు మూడువేల దరఖాస్తులిలా ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. తద్వారా ఖర్చులు పెరగడంతో పాటు అనుమతి జారీలో జాప్యం చోటు చేసుకుంటోంది. భవనాలకు 21 రోజుల్లోనే అనుమతులు జారీ చేయాలనే నిబంధన వచ్చాక ఇలాంటి తిరస్కరణలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితి నివారించేందుకు, నిర్మాణదారుల ఇబ్బందులు తప్పించేందుకు  ఆటో డీసీఆర్‌ (ఆటో డెవలప్‌మెంట్‌ కంట్రోల్‌ రెగ్యులేషన్స్‌) ద్వారా దరఖాస్తుకు ముందే ప్లాన్‌ సరిగ్గా ఉందో లేదో తెలుసుకునే ప్రీ స్క్రూటినీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ,  ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. దాని కోసం సంబంధిత కార్యాలయాల దాకా వెళ్లాల్సి వస్తోంది. లేదా ఆర్కిటెక్టులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో చేయి తడిపితేనే పనులవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో డీసీఆర్‌ ద్వారా ప్రీ స్క్రూటినీతో తమ బిల్డింగ్‌ ప్లాన్‌ సరిగ్గా ఉందో లేదో ఎక్కడినుంచైనా యజమాని/ఆర్కిటెక్ట్‌  ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనున్నారు.  

నిర్ణీత ఫార్మాట్‌లో ప్లాన్‌ నమూనాను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌చేస్తే.. ప్లాన్‌ సరిగ్గా ఉన్నదీ లేనిదీ ఆన్‌లైన్‌లోనే తెలుస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటే ఓకే అని చూపుతుంది. లేని పక్షంలో ఎక్కడ లోపాలున్నాయో తెలుపుతుంది. భవన నిర్మాణానికి సంబంధించి  సెట్‌బ్యాక్‌లు, ఎత్తు, వెంటిలేషన్‌ తదితరమైనవి నిబంధనల కనుగుణంగా లేని పక్షంలో ఆ వివరాలు తెలియజేస్తుంది. ఆమేరకు స్క్రూటినీ రిపోర్ట్‌ జనరేట్‌ అవుతుంది. తద్వారా భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తును ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేయడానికి ముందే ప్లాన్‌ సక్రమంగా ఉన్నదీ లేనిదీ స్వీయ పరిశీలనతోనే తెలుసుకోగలుగుతారు. లోపాలుంటే సరిదిద్దుకుంటారు.   తద్వారా ఎంతో సమయం, వ్యయం కలిసి వస్తాయి. స్క్రూటినీలో ఓకే అయ్యాక ఇతర సాకులు చూపి, నిర్మాణ అనుమతులు జాప్యం చేసేందుకు అవకాశం ఉండదు. భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రజలు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండే చర్యల్లో భాగంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. సర్కిల్‌ స్థాయి వరకు అనుమతులిచ్చే నిర్మాణాలకు సైతం ఇది అందుబాటులోకి వస్తుంది. తద్వారా తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకునేవారికి ఎంతో సదుపాయంగా ఉంటుందని భావిస్తున్నారు.  

అన్ని విభాగాల్లోనూ.. 
జీహెచ్‌ఎంసీతోపాటు హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, డీటీసీపీల పరిధిలోని భవనాల ప్లాన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఇందుకోసం  ప్రత్యేక వెబ్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేనున్నారు. వీటన్నింటికీ హెచ్‌ఎండీఏ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ ఏర్పాటుకయ్యే వ్యయంలో జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ, డీటీసీపీలు తమవంతు వాటా నిధులు చెల్లిస్తాయని సంబంధిత అధికారి తెలిపారు. జీప్లస్‌ ఐదంతస్తుల భవనాల ప్లాన్ల వరకు దీన్ని అందుబాటులోకి తేనున్నారు. దాదాపు రెండునెలల్లోగా ఇది అందుబాటులోకి రానుంది.

>
మరిన్ని వార్తలు