శెభాష్‌... షాహెద్‌

5 Mar, 2019 09:50 IST|Sakshi

చిరు వ్యాపారి సేవా దృక్పథం  

‘పది’ విద్యార్థులకు స్నాక్స్‌ పంపిణీ  

పరీక్షలకు ముందు 40 రోజులు..  

ఐదేళ్లుగా అందజేస్తున్న షాహెద్‌

ముషీరాబాద్‌: అతనో చిరు వ్యాపారి.. అయితేనేం సేవలో పెద్ద మనసున్న వ్యక్తి. ముషీరాబాద్‌ ఏక్‌మినార్‌లోని మసీదు ఎదుట ఓ చిన్న కూల్‌డ్రింక్స్‌ దుకాణం నిర్వహించే షాహెద్‌ సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నాడు. తనకు తోచిన సాయం చేస్తూ గొప్పగా జీవిస్తున్నాడు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం విదితమే. సాయంత్రం 7గంటల వరకు విద్యార్థులు స్కూళ్లోనే ఉండాల్సి రావడంతో ఆకలితో అలమటిస్తున్నారు. ఇది గమనించిన సామాజిక కార్యకర్త మహ్మద్‌ షాహెద్‌.. వారి ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నాడు. గత ఐదేళ్లుగా పరీక్షలకు 40 రోజుల ముందు నుంచి  ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు (దాదాపు 100 మంది) ప్రతిరోజు స్నాక్స్‌ అందజేస్తున్నాడు. అరటిపండ్లు , మిక్చర్, జ్యూస్, వాటర్‌ బాటిల్, బిస్కెట్‌ ప్యాకెట్స్, గ్లూకోజ్‌ ప్యాకెట్స్, మ్యాంగో టెట్రా ప్యాకెట్స్‌ ఇలా ఒక్కో రోజు ఒక్కో రకం అందిస్తున్నాడు. ప్రతిరోజు రూ.2,500 చొప్పున 40 రోజులకు రూ.లక్ష సేవకు వెచ్చిస్తున్నాడు. ‘నాంది’ ఫౌండేషన్‌కు ముందే షాహెద్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం.  

తన షాప్‌లో షాహెద్‌
సేవానందం...  
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ఎవరైనా సహాయం కోరితే నాకు తోచిన సహాయం చేయడం బాధ్యతగా భావిస్తాను. నేను పెద్దగా చదువుకోకపోయినా కష్టపడి చదువుకునే పేద విద్యార్థులకు సహాయం చేయాలనుకున్నాను. సేవలోనే నాకు ఆనందం ఉంది. నాకు ఎంత ఆదాయం వస్తుందనేది ముఖ్యం కాదు.. నాకున్న దాంట్లో నేనెంత సహాయం చేస్తున్నాననేదే ముఖ్యం.         – షాహెద్‌ 

మరిన్ని వార్తలు