7లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తాం: మంత్రి

30 Dec, 2019 14:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతాంగానికి ఉపయోగపడే ఎన్నో పనులను ప్రభుత్వం చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే సాగునీటి కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేశారన్నారు. సోమవారం ఆయన హాకా భవన్‌లో మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది కూడా కాలేదన్నారు. పది నెలల కాలంలో తన శక్తి మేర పనిచేస్తున్నానన్నారు. ఎంత పని చేసినా ఇంకా మిగిలే ఉంటుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో 7 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ ఫామ్‌ సాగు చేయాలని నిర్ణయించామన్నారు. ఖరీఫ్‌లోగా దీన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

ఇప్పటికే దీనికోసం స్థానిక రైతులు క్షేత్ర స్థాయి పర్యటన చేశారని, వారు దీనికి సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. నూనె గింజల ఉత్పత్తి పెంచడం కోసం రానున్న రోజుల్లో ప్రకటన కూడా రావచ్చని వ్యాఖ్యానించారు. రైతుబంధు 94 శాతం మంది రైతులకు అందిందని స్పష్టం చేశారు. మిగతా వాళ్లకు రబీ సీజన్‌ వరకు అందజేస్తామని పేర్కొన్నారు. కాగా పసుపు బోర్డు, పసుపు మద్దతు ధరలపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు