ఏదేమైనా సీఏఏను అమలు చేసి తీరుతాం: కిషన్‌ రెడ్డి

30 Dec, 2019 14:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేసి తీరుతామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.  సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌లో సోమవారం బీజేపీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ఈ సమావేశంలో  మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు  పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక రంగంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం ఏ ఒక్క భారతీయుడికీ వ్యతిరేకం కాదని అన్నారు. రాహుల్‌ గాంధీ తీరు చదివిస్తే ఉన్న మతి పోయిందన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్‌, మజ్లీస్‌, కాంగ్రెస్‌ మూడు పార్టీలు ఒక్కటేనని.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను నడిపించేది ఎంఐఎం పార్టీనేనని మండిపడ్డారు. హోంశాఖ మంత్రిగా ఉన్న మహమూద్‌ అలీని కేసీఆర్‌, అసదుద్దీన్‌ ఇద్దరూ అవమానించారని ఆరోపించారు.

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తగదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలు కలిసి హింసకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బీహర్లో నిరసనల సందర్భంగా 280 మంది పోలీసులకు గాయాలయ్యాయని. హింసలో పాల్గొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హింసాత్మక దాడిలో పాల్గొన్న వారి నుంచే నష్ట పరిహారం వసూలు చేస్తామని అన్నారు. ఏ ఒక​ భారతీయుడికి ఈ చట్టం వ్యతిరేకం కాదని తెలిపారు. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ.. ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. స్వదేశీ శక్తులు, విదేశీ శక్తులు కలిసి మోదీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో కొంతమంది విధ్వంసకారులు పోలీసులపై దాడులకు పాల్పడిన విషయాన్ని గుర్తు చేస్తూ..పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు.

>
మరిన్ని వార్తలు