అవసరానికి తగ్గట్టు సాగు

13 Dec, 2019 02:45 IST|Sakshi

ఉత్తమ వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి

మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉత్తమ వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. గురువారం హాకా భవన్‌లో వ్యవసాయ విధానంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో చర్చించిన.. తీసుకున్న నిర్ణయాలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఓ ప్రకటన విడు దల చేశారు.

సమావేశంలో ప్రజల ఆహార అవసరాలు, ఉత్పత్తులు, ప్రాసెసింగ్, విత్తన పంపిణీ, ఎరువులు, మద్దతు ధర, కొనుగోళ్ల అంశాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు తగినట్లు పంటల సాగును ప్రోత్సహించాలన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచన అని అన్నారు. ఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారన్నారు. ఈ సమావేశంలో ఉత్పత్తులు, ఫుడ్‌ ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్‌పై ఉత్తమ విధానం రూపొందించేలా సూచనలు వచ్చాయన్నారు.

ఉల్లి విషయంలో రైతులకు మద్దతు ధర ఇచ్చి ప్రోత్సహిస్తే ప్రస్తుత పరిస్థితి రాదన్నది మంత్రివర్గ ఉపసంఘం సభ్యుల ఆలోచనగా ఉందన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్‌కు నివేదించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉల్లి విత్తనాలను రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. కాగా, 10 రోజుల తర్వాత  తదుపరి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు