బీడీ కార్మికులకు ‘పుర్రె’ భయం

7 Dec, 2015 03:03 IST|Sakshi
బీడీ కార్మికులకు ‘పుర్రె’ భయం

జగిత్యాల రూరల్: బీడీ కార్మికులకు మళ్లీ ‘పుర్రె’ భయం పట్టుకుంది. బీడీ కట్టల ప్యాకింగ్‌పై 85 శాతం మేరకు పుర్రె గుర్తును ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో జీవో 729 విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి బీడీకట్టలపై ఈ మేరకు పుర్రె గుర్తు ఉండాల్సిందేనని కేంద్ర ఆరోగ్యశాఖ బీడీ కంపెనీలకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు గత యూపీఏ ప్రభుత్వం 25 శాతం పుర్రెగుర్తు ముద్రిం చాలని ఆదేశించగా... ప్రస్తుత ప్రభుత్వం ‘పుర్రె’ సైజును 85 శాతానికి పెంచింది. దీంతో రానున్న రోజుల్లో బీడీల వినియోగం తగ్గి, ఆ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోనున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు ఆరు లక్షల మంది బీడీకార్మికులున్నారు.

కరీంనగర్ జిల్లాలో 50 కంపెనీల్లో సుమారు రెండు లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తుండగా, నిజామాబాద్ జిల్లాలో వంద కంపెనీల్లో 2.80 లక్షల మంది, ఆదిలాబాద్ జిల్లాలో పది కంపెనీల్లో 40 వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. వీరితోపాటు బీడీ కంపెనీల్లో ప్యాకర్స్, టేకర్స్, బట్టీవాలాలు పనిచేస్తుంటారు. వీరిలో మహిళలే అధికం. బీడీకట్టలపై పుర్రెగుర్తు ముద్రించడం తో వ్యాపారం తగ్గి.. బీడీ కంపెనీలు మూతపడే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

 సంక్షేమం మరిచిన సర్కారు: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో మహిళలు అధికంగా బీడీ పరిశ్రమపై ఆధారపడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్నారు. చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు వేతనాలు పెంచకపోగా.. ఇప్పుడు పుర్రె గుర్తును తెరపైకి తేవడంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో బీడీ కార్మికురాలు వెయ్యి బీడీలు చుడితే వారి నుంచి సుంకం పేరుతో రూ.16 వసూలు చేస్తోంది. దేశంలో ఉన్న బీడీ కార్మికులకు గత ఇరవై ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తప్ప కొత్తగా పథకాలు తీసుకురాకపోవడంతో తమ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో అర్థమవుతోందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 వీధిన పడతాం..
 నేను బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. బీడీల కంపెనీలు మూతపడితే వీధిన పడతాం.
 - గొడుగు అంజవ్వ, బీడీ కార్మికురాలు,హన్మాజీపేట, జగిత్యాల మండలం
 
 ‘పుర్రె’ను తీసేయాలి

 వ్యవసాయ పనులు లేక  బీడీలపైనే ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నాం. పుర్రెగుర్తును తీసేసి బీడీ పరిశ్రమలు మూతపడకుండా చూడాలి.  
 - బోధనపు లక్ష్మి, బీడీ కార్మికురాలు, పొరండ్ల, జగిత్యాల మండలం

మరిన్ని వార్తలు