‘వీధి’ బతుకులకు ఆదరువు

6 Aug, 2014 01:14 IST|Sakshi
‘వీధి’ బతుకులకు ఆదరువు

చిరు వ్యాపారులకు త్వరలో ప్రభుత్వ గుర్తింపు
అందరికీ గుర్తింపు కార్డులు, విక్రయ సర్టిఫికెట్లు
పోలీసు, మున్సిపల్ వేధింపుల నుంచి విముక్తి
వీధి వ్యాపారుల జీవనోపాధి చట్టం అమలుకు కసరత్తు షురూ

 
హైదరాబాద్: ఇక్కడ్నుంచి వెళ్లిపోమని పోలీసులు ఓవైపు గద్దిస్తుంటే .. కొద్దిగా రోడ్డు అంచుకు బండిని జరుపుకుంటూ.. ‘చోడో ..జానే దో సాబ్’ అంటూ వీధి వ్యాపారులు చేసే వేడుకోలును మనం తరచూ చూస్తూనే ఉం టాం. త్వరలో చిరువ్యాపారులకు అలాంటి అవస్థలు తప్పనున్నాయి. రద్దీగా ఉండే రోడ్లపై తోపుడు బండ్లు.. ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక స్టాల్స్ పెట్టుకునే చిరు వ్యాపారులకూ ప్రభుత్వ గుర్తింపు లభించనుంది. అసంఘటిత రంగ జీవులుగా ఇంతకాలం అష్టకష్టాలు పడిన వారికి ఇకపై పోలీసు, మునిసిపల్ సిబ్బంది వేధింపుల నుంచి ఉపశమనం లభించనుంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రూపుదిద్దుకున్న వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ, క్రమబద్ధీకరణ చట్టం-2014 అమలుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే పట్టణ విక్రయ కమిటీలను ఏర్పాటు చేశాయి. అటు ఇరు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల పరిధిలో జీవనోపాధి పొందుతున్న వీధి వ్యాపారుల గణన జరుగుతోంది. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. అనంతరం ఆయా నగర, పురపాలక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు, విక్రయ సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు.

విక్రయ జోన్‌ల ఏర్పాటు..

ప్రస్తుతం అన్ని నగరాలు, పట్టణాల్లో విక్రయ, విక్రయేతర జోన్లను గుర్తిస్తున్నారు. తోపుడు బండి కానీ, ఇతర తాత్కాలిక స్టాల్స్ కానీ ఏర్పాటు చేసుకునేందుకు విక్రయ జోన్లలో ప్రతి వీధి వ్యాపారికి నిర్దిష్టమైన స్థలాన్ని కేటాయిస్తారు. అదే విధంగా ఆయా విక్రయ జోన్లలో తిరుగుతూ వ్యాపారం చేసుకునేందుకు అనుమతిస్తారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగే ప్రాంతాలను మాత్రం విక్రయేతర జోన్లుగా గుర్తించనున్నారు. విక్రయేతర జోన్లలో వీధి వ్యాపారాలకు అనుమతినివ్వరని అధికారులు పేర్కొంటున్నారు. విక్రయ జోన్ల ఏర్పాటు బాధ్యతను ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల కమిషనర్లకు అప్పగించారు.

ప్రయోజనాలివీ..

రిజిస్ట్రేషన్ సంఖ్యతో గుర్తింపు కార్డు, అమ్మకాలు జరుపుకునేందుకు అనుమతిస్తూ ధ్రువీకరణ పత్రమూ ఇస్తారు. వీటి వల్ల వీధుల్లో అమ్మకాలు జరిపే హక్కు వారికి లభిస్తుంది.  ఎస్‌హెచ్‌జీల తరహాలో వీధి వ్యాపారులతో సం ఘాలు ఏర్పాటు చేస్తారు. ఈ సంఘాలకు ప్రభుత్వ రాయితీ పథకాల కింద బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ఈ సంఘాల్లోని సభ్యులకు జీవిత, ఆరోగ్య బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తారు.
 

మరిన్ని వార్తలు