కొలువుల పండుగ   

24 Jul, 2018 10:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

త్వరలో పంచాయతీ కార్యదర్శుల నియామకాలు

ఉమ్మడి జిల్లాలో భర్తీ చేయాల్సిన పోస్టులు 291

పదోన్నతులు ఇస్తే ఖాళీలు పెరిగే అవకాశం

మొత్తం మంజూరైన  పోస్టుల్లో వేకెన్సీలు 225

గ్రేడ్‌-4లో 30 పోస్టులు ఖాళీ

సాక్షి, హన్మకొండ అర్బన్‌ జయశంకర్‌ జిల్లా : పంచాయతీ కార్యదర్శుల పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లాస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉండడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. కానీ, జిల్లాలో భర్తీకి అవకాశం ఉన్న వాటిలో ఖాళీలు ఎక్కువగా లేకపోవడం కొంత నిరాశపరుస్తోంది.

ఇదిలా ఉండగా నియామక ప్రక్రియ ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో చేపడతారా లేక కొత్త జిల్లాల ప్రాతిపదికన ఆయా జిల్లాల కలెక్టర్లు చేపడతారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకా రం..పాత వరంగల్‌ జిల్లా పరిధిలో 962 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి నాలుగు గ్రేడుల్లో 701 కార్యదర్శి పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 476 మంది వివిధ గ్రేడుల్లో కార్యదర్శులుగా పని చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో భర్తీకి అవకాశం ఉన్న పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-4 ఖాళీలు 30 మా త్రమే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నియామక ప్రక్రియ చేపడితే వీటిని మాత్రమే భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తు తం 174మంది గ్రేడ్‌ -4 కార్యదర్శులు పనిచేస్తున్నారు. అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పిస్తే ఆ ఖా ళీలు కూడా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. 

పదోన్నతులు ఇస్తేనే అవకాశం...

ప్రస్తుతం పాత వరంగల్‌ జిల్లాలో గ్రేడ్‌-4 పంచా యతీ కార్యదర్శులుగా 174 మంది పనిచేస్తున్నా రు. వీరి పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తయితే గ్రేడ్‌-4లో మరో 100 ఖాళీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో మొత్తం 100కుపైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది. పదోన్నతులు, నియామకాల ప్రకియ మొత్తం జిల్లా కలెక్టర్‌ స్థాయిలో చేపట్టాల్సి ఉంది. అధికారులు చొరవ చూపితేనే కొత్త పోస్టులు పెరిగే అవకాకాశం ఉంటుంది.

మొత్తం నాలుగు గ్రేడుల్లో...

పంచాయతీ కార్యదర్శులు మొత్తం నాలుగు గ్రేడుల్లో పనిచేస్తుంటారు. గ్రేడ్‌ 1, 2, 3, 4గా వీరి హోదా ఉంటుంది. నియామక ప్రక్రియ మాత్రం గ్రేడ్‌–4లో ఉంటుంది. మిగతా హోదా పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. గ్రేడ్‌–4, 3 వారికి జిల్లా కలెక్టర్‌ పదోన్నతి కల్పించే అవకాశం ఉంటుంది. గ్రేడ్‌–2, 1 వారికి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది. గ్రేడ్‌ –1 వారికి పదోన్నతి కల్పిస్తే ఈఓపీఆర్డీ హోదా పొందుతారు.

ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ స్థాయిలో అవకాశం ఉన్న 4, 3 గ్రేడుల్లో ఉమ్మడి జిల్లాలో 330 మంది కార్యదర్శులు ఉన్నారు. వీరిలో మొదట గ్రేడ్‌–3 వారికి పదోన్నతి కల్పించాలి. తద్వారా ఏర్పడిన ఖాళీల్లో గ్రేడ్‌ –4 వారికి పదోన్నతి కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతం గ్రేడ్‌–4లో ఉన్న 174లో ఏంత మంది పదోన్నతి పొందుతారన్న విషయం స్పష్టమవుతుంది. వారి పదోన్నతి ద్వారా ఏర్పడిన గ్రేడ్‌ –4 ఖాళీలు జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్‌స్సీ) ద్వారా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది.

2013లో చివరగా భర్తీ..

జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియ 2013లో చేపట్టారు. ఆ సమయంలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, మెడికల్‌ ఇన్‌వాల్యూడేషన్‌ తదితర కేటగిరీల్లో కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి 25 శాతం అదనపు మార్కులు కలిపి సుమారు 130 పోస్టులు భర్తీ చేశారు. తర్వాత కొద్ది రోజులకు సాధారణ నోటిఫికేషన్‌ ద్వారా మరో 113 పోస్టులను భర్తీ చేశారు. మొత్తం 200కుపైగా పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేశారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా పంచాయతీ కార్యర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 

కొత్త పంచాయతీలపై స్పష్టత కరువు

పంచాయతీ కార్యదర్శుల ఖాళీల భర్తీని ఏ ప్రాతిపదికన చేపట్టినా కొత్త గ్రామ పంచాయతీల విషయంలో మరింత స్పష్ట రావాల్సి ఉంటుంది. ఆగస్టు ఒకటి నుంచి కొత్త గ్రామ పంచాతీయలు ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించినా సాంకేతికంగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రాలేదు. గ్రామ పంచాయతీల ఏర్పాటు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఆయా పంచాయతీల జనాభాను బట్టి పంచాయతీ కార్యదర్శుల పోస్టులు గుర్తిస్తారు.

ఆ పోస్టులను పీఆర్‌ శాఖ, ఆర్థిక శాఖలు ఆమోదించి ఉత్తర్వులు వెలువరిస్తే..వాటిలో గ్రేడ్‌ –4 కార్యదర్శుల పోస్టులు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో భర్తీకి అవకాశం ఉంటుంది. కార్యదర్శుల భర్తీకి సత్వరం చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం కొత్త పంచాయతీల విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 962 గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 701 పంచాయతీలకు మాత్రమే పంచాయతీ కార్యదర్శి పోస్టులు మంజూరై ఉన్నాయి. మిగతా 261పంచాయతీలకు కార్యదర్శులు లేరు. ఈ పంచాయతీలు ఇన్‌చార్జిల పాలనలో ఉంటున్నాయి.

701 మంజూరు పోస్టులకు గాను ప్రసుతం 476 మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరిలో గ్రేడ్‌–1లో 49 మంది, గ్రేడ్‌–2లో 47 మంది, గ్రేడ్‌–3లో 156 మంది, గ్రేడ్‌–4లో 174 మంది పనిచేస్తున్నారు. వీరితోపాటు ఇతర శాఖల నుంచి పంచాయతీ కార్యదర్శులుగా వచ్చిన వారు 50 మంది ఉన్నా రు. మొత్తం 476 మంది పంచాయతీ కార్యదర్శులుగా వివిధ గ్రేడ్లలో పనిచేస్తున్నారు.

గ్రేడ్‌–4లో 174 మంది పనిచేస్తుండగా.. వారిలో వరంగల్‌ అర్బన్, రూరల్, జనగామ జిల్లాలో గ్రేడ్‌–4 ఖాళీలకన్నా ఎక్కువ మంది కార్యదర్శులు ఉన్నారు. వీరందరూ గ్రేడ్‌–1,2,3 వారి స్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆ మూడు జిల్లాలో గ్రేడ్‌–4 శాంక్షన్‌ పోస్టుల కన్నా పనిచేస్తున్న కార్యదర్శుల సంఖ్య ఎక్కువగా ఉంది.

భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలో మాత్రం గ్రేడ్‌–4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భూపాలపల్లిలో గ్రేడ్‌ –4 పోస్టులు మొత్తం 95 ఉండగా 54 మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. 41 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహబూబాబాద్‌లో గ్రేడ్‌–4 పోస్టులు 55కాగా 21మంది మాత్రమే గ్రేడ్‌–4 స్థాయి కార్యదర్శులు ఉన్నారు. ఈ జిల్లాలో కూడా 34పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మొత్తంగా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన  పోస్టులు భర్తీ చేయడంతోపాటు ప్రతి పంచాయతీకి కార్యదర్శిని కేటాయిస్తే ఉమ్మడి జిల్లాకు ఇప్పటివరకు కార్యదర్శులు లేని 261 పోస్టులు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 30 పోస్టులు భర్తీకి అవకాశం ఉంటుంది. కొత్త జీపీలకు కార్యదర్శులను ఇస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు