కరోనా కట్టడిలో దక్షిణమధ్య రైల్వే

2 May, 2020 07:39 IST|Sakshi

ఇప్పటి వరకు 486 ఐసోలేషన్‌ కోచ్‌లు

1080 క్వారంటైన్‌ పడకలు

రైల్వే ఆసుపత్రుల్లో 280 ఐసోలేషన్‌ వార్డులు

నిరాటంకంగా నిత్యావసర వస్తువుల చైన్‌  

సాక్షి, సిటీబ్యూరో: మహమ్మారి కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు  దక్షిణమధ్య రైల్వే అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే సుమారు 486 ఐసోలేషన్‌ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చిన అధికారులు నిత్యావసర వస్తువులు, ఆహారధాన్యాలు, పాలు, పండ్లు తదితర వస్తువుల సరఫరా చైన్‌ నిరాటంకంగా కొనసాగేందుకు ప్రత్యేక పార్సిల్‌ రైళ్లు, సరుకు రవాణా రైళ్ల వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. నెల రోజులుగా ఈ సరఫరా చైన్‌ కొనసాగుతోంది. ప్రతి రైల్వేస్టేషన్‌ నుంచి వివిధ రకాల వçస్తువులనుఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 122 సరుకు రవాణా రైళ్లు, 183 పార్శిల్‌ రైళ్లను ఇందుకోసం అందుబాటులో ఉంచినట్లు  దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సప్‌లై చైన్లో భాగంగా సుమారు 50 లక్షల లీటర్ల పాలు, 1000 టన్నుల ఆహారధాన్యాలు, çమామిడిపండ్లు, తర్బూజా, బ్రెడ్, తదితర వస్తువులను సరఫరా చేశారు. సికింద్రాబాద్‌ అమృత్‌సర్, కాకినాడ, రేణిగుంట, ముంబయి, హౌరా, తదితర ప్రాంతాలకు పార్సిల్‌ రైళ్లను నడుపుతున్నారు. మరోవైపు ఆహారధాన్యాల  సరఫరా కోసం 84 వ్యాగన్లతో కూడిన జైకిసాన్‌ రైళ్లను సైతం పట్టాలెక్కించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేష్‌  తెలిపారు. ఈ రైళ్ల ద్వారా ప్రతి రోజు 2500 టన్నుల  ఆహారధాన్యాలు, వివిధ రకాల వస్తువులు  ప్రజలకు  అందుబాటులోకి వస్తున్నాయి. ‘ మహమ్మారి కరోనా కట్టడి చర్యల్లో  భాగంగా విధించిన లాక్డౌన్‌ వల్ల ఎక్కడా ఆహారధాన్యాలు, నిత్యావసర వస్తువుల కొరత  తలెత్తకుండా  ఈ  సప్‌లై చైన్‌ నిరంతరం పని చేస్తుంది.’ అని చెప్పారు. మరోవైపు  రైతుల నుంచి సేకరించిన పాలను దక్షిణమధ్య రైల్వే నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు రెండు రోజులకు ఒకసారి దూద్‌ దురంతో రైళ్లు నడుస్తున్నాయి. ఒక్కో ట్రైన్‌కు 5 వ్యాగన్ల చొప్పున ఏర్పాటు చేశారు. 

రెడీ ఫర్‌ ఎనీటైమ్‌....
మరోవైపు  కరోనా కట్టడి చర్యల్లో భాగంగా  ఏర్పాటు చేసిన 486 ఐసోలేషన్‌ కోచ్‌లను ఎక్కడి నుంచి ఎక్కడికైనా  తరలించేందుకు  సిద్ధంగా ఉంచారు. ఇప్పటి వరకు వీటి అవసరం రాకపోయినా అప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను   దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు. ‘ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లు, ఐసోలేషన్లు అవసరాలకు సరిపడా ఉన్నాయి. కానీ మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాలు తప్పనిసరి అయినప్పుడు ఈ కోచ్‌లు వినియోగంలోకి వస్తాయి.’ అని అధికారులు వివరించారు. ఇవి కాకుండా లాలాగూడలోని కేంద్రీయ ఆసుపత్రితో పాటు, ఇతర ఆసుపత్రుల్లోనూ 1080 పడకలను, 280 ఐసోలేషన్‌ వార్డులను సిద్ధంగా ఉంచారు.మహమ్మారి ఉధృతిని, వ్యాప్తిని  దృష్టిలో ఉంచుకొని  దక్షిణమధ్య రైల్వే  పెద్ద ఎత్తున  ఏర్పాట్లు చే పట్టింది.

ఇంటి వద్దకే మందులు....
మరోవైపు రైల్వే సిబ్బంది కోసం ప్రారంభించిన ఇళ్ల వద్దకే మందులను సరఫరా చేసే సదుపాయం కూడా సత్ఫలితాలను ఇస్తోంది. నాలుగు రోజుల క్రితం దీనిని ప్రారంభించారు. హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, వివిధ రకాల వ్యాధుల కోసం మందులు వాడుతున్న రోగులు లాలాగూడలోని రైల్వే కేంద్రీయ ఆసుపత్రికి రావలసిన అవసరం లేకుండా వారికి ఇంటి వద్దకే మందులను సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 250 మందికిపైగా మందులను అందజేశారు. రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తమకు కావలిన మందుల కోసం వాట్సప్‌ నెంబర్‌ 9701370555 లేదా 9618936328 నెంబర్లకు పేషెంట్‌ పేరు, ఉద్యోగి పేరు, గతంలో డాక్టర్‌ రాసిన ప్రిస్కిప్షన్‌ కాపీ పంపిస్తే చాలు.

మరిన్ని వార్తలు