భూదాన్ భూముల చిట్టా...

9 Oct, 2014 23:22 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూదాన్ యజ్ఞబోర్డు మాజీ పాలకవర్గం పాపాల పుట్టను తవ్వేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చేతులు మారిన భూదాన్ భూముల చిట్టాను విప్పేందుకు ప్రత్యేక అధికారులను రంగంలోకి దించింది. భూదాన్‌బోర్డు ముసుగులో చేసిన అక్రమాలను వెలికితీసేందుకు జిల్లాకు ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు ఓ.జే మధు, లింగయ్యనాయక్, జి.రమేశ్, కె.సీతారామారావు, ఎం.శేఖర్‌రెడ్డి, కె.ప్రదీప్‌కుమార్‌లను నియమిస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లావ్యాప్తంగా 11,744 ఎకరాల మేర భూదాన్ భూములు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం లెక్క తేల్చింది. ఇందులో 7,363 ఎకరాలు భూమిలేని పేదలకు పంపిణీ చేసినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దీంట్లో మూడు వేల ఎకరాలు లబ్ధిదారుల ఆధీనంలో ఉన్నట్లు తేల్చగా, సుమారు 1,600 ఎకరాల మేర ఎన్ ఎస్‌జీ, ఆక్టోపస్, ఎన్‌ఐఏ, ఎన్‌పీఏ సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది. ఇవి పోగా, మిగతా భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే అంశంపై స్పష్టత రావడంలేదు. వినోభాబావే పిలుపుమేరకు భూదానోద్యమంలో చాలామంది దాతలు విరివిగా భూ వితరణ చేశారు. ఈ భూములను కాపాడాల్సిన యజ్ఞబోర్డు కంచె చేను మేసిన చందంగా కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే భూదాన్ బోర్డు పాలకవర్గం నిర్వాకంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బోర్డు ప్రతినిధులు చేసిన అక్రమాలను లోతుగా విచారించి సమగ్ర నివేదికను సర్కారుకు అందజేసే బాధ్యతను డిప్యూటీ కలెక్టర్లకు అప్పగించారు.

ఫర్ సేల్..!
పేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్ధేశంతో దాతలు దానం చేసిన భూములు వక్రమార్గంలో పరాధీనమయ్యాయి. శివార్లలో విలువైన భూములు రియల్టర్ల గుప్పిట్లోకి వెళ్లాయి. భూములను పరిరక్షించాల్సిన బోర్డు ప్రతినిధులు.. రియల్టర్లుగా అవతారమెత్తారు. దీంతో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, యాచారం, హయత్‌నగర్, కీసర తదితర మండలాల్లోని భూదాన్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ క్రమంలో భూదాన్ యజ్ఞబోర్డు చైర్మన్ రాజేందర్‌రెడ్డి కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో కేసీఆర్ సర్కా రు.. పాలకవర్గాన్ని రద్దు చేసింది. రికార్డులను కూడా స్వాధీనం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే భూదాన్ భూముల స్థితిగతులపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం 3,060, యాచారం 1,300, మొయినాబాద్ 470, మహేశ్వరం 506, కందుకూరు 530, శంషాబాద్ 564, కీసర 51 ఎకరాల మేర భూదాన్ భూములున్నట్లు లెక్క తేలింది. అయితే, రికార్డులకు అనుగుణంగా భూముల లెక్కలు తేలకపోవడంతో యంత్రాంగం జుట్టుపీక్కుంటోంది. సర్వే నంబర్లలో ఉన్న విస్తీర్ణంకంటే ఎక్కువ మొత్తాన్ని దానం చేసినట్లు రికార్డుల్లో పేర్కొనడం, కొన్నిచోట్ల భూమిని దానం చేసినట్లు ప్రకటించినప్పటికీ, దాతల కుటుంబాల  పోజిషన్‌లోనే భూములు ఉన్నట్లు స్పష్టమైంది. మరికొన్ని చోట్ల ఒరిజినల్ పట్టాదారుల స్థానే ఇతరులు సాగు చేసుకుంటున్నట్లు యంత్రాంగం పసిగట్టింది.

మరిన్ని వార్తలు