పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

14 Mar, 2018 11:20 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, జేసీ, అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా రూ.1003 కోట్లు విడుదల

ఈనెలాఖరులోగా ప్రతిపాదనలు పంపండి

నుడాకు మాస్టర్‌ ప్లాన్‌ తప్పనిసరి

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల రూపు రేఖలు మార్చేందుకు అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా రూ.1003 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, మున్సిపల్‌ అధికారులతో హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలకు గతంలో మంజూరు చేసిన ప్రత్యేక నిధులు లేదా పన్ను రూపేణ వచ్చిన, ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నిధులను కలెక్టర్‌లకు మంజూరు చేస్తామన్నారు. పట్టణాలు, నగరాల ప్రధాన కూడళ్ల వద్ద రోడ్ల నిర్మాణాలు, పార్కుల ఏర్పాటు పనులను గుర్తించి ఈనెల 31లోగా ప్రతిపాదనలు పంపాలన్నారు. మున్సిపాల్టీలకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనలు, సలహాలతో ప్రజలు కోరుకునే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(నుడా) ప్రకటించిన జిల్లాలోని మున్సిపాల్టీల మాస్టర్‌ ప్లాన్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 15వేల జనాభా గల గ్రామాలను నగర పంచాయతీలుగా, మున్సిపాలిటీలుగా ప్రకటించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో మున్సిపాలిటీల సంఖ్య 145కు చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ నిజామాబాద్‌ నగరంలో మిషన్‌ భగీరథ, అండర్‌ డ్రెయినేజీ పనులు సమాంతరంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాన్ఫరెన్స్‌లో జేసీ రవీందర్‌ రెడ్డి, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, నగర పాలక కమిషనర్‌ జాన్‌ సాంసన్, అధికారులున్నారు.  

మరిన్ని వార్తలు