పోలింగ్‌కు ముందే రాష్ట్ర సరిహద్దుల మూసివేత

3 Nov, 2023 03:08 IST|Sakshi

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌ ఆదేశం... నవంబర్‌ 28 నుంచి 30 వరకు డ్రై డేగా ప్రకటించాం 

ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపిన సీఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల పోలింగ్‌ జరిగే నవంబర్‌ 30వ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేసి బయటి రాష్ట్రాల నుంచి వ్యక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలతో పాటు వాటి సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌...ఎన్నికల కమిషనర్లు ఏసీ పాండే, అరుణ్‌ గోయెల్‌తో కలిసి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్‌పోస్టును కట్టుదిట్టం చేశామని వివరించారు. నవంబర్‌ 28 నుంచి పోలింగ్‌ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయని, సాధారణ నేర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు