పుష్కరాలపై త్రినేత్రం

9 Apr, 2016 02:59 IST|Sakshi
పుష్కరాలపై త్రినేత్రం

సీసీ కెమెరాలతో నిఘా
 
గుర్తించిన ఘాట్ల వద్ద ఏర్పాటుచేయనున్న పోలీసు అధికారులు
►  అడుగడుగునా భారీ బందోబస్తు
  జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా భద్రత, ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు
►  ప్రణాళిక రూపొందించిన  పోలీస్‌శాఖ  

 
 
 కృష్ణానదీ అగ్రహారంవద్ద ఉన్న పుష్కర ఘాట్
 
మహబూబ్‌నగర్ క్రైం
  కృష్ణా పుష్కరాలపై మూడోనేత్రంతో నిఘా వేయనున్నారు. పూర్తిగా సీసీ కెమెరాలతో పహారా కాయాలని భావిస్తున్న పోలీస్ అధికారులు.. అందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో కృష్ణానదీ తీర ప్రాంతాలు అధికంగా ఉన్న నేపథ్యంలో పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఈసారి జిల్లాలో పుష్కర ఘాట్లకు దాదాపు మూడు కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు 40నుంచి 45వేల మందికి ఒక సీసీ కెమెరాతో పర్యవేక్షణ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 32 ఘాట్లను గుర్తించిన అధికారులు బందోబస్తు పరంగా ఎక్కడా తగ్గకుండా చూస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని  క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


 32ఘాట్లలో 400సీసీ కెమెరాలు..
జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు మాసంలో జరగనున్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు తగినంత పోలీస్ బలగాలతోపాటు గుర్తించిన 32 ఘాట్లలో రూ.2కోట్లతో 400సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీస్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇందుకు కావాల్సిన కెమెరాలు, పోలీస్ బలగాలు, భారీ గ్రేడ్స్ ఇతర వాటికి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పోలీస్‌శాఖ నుంచి ప్రతిపాదన వెళ్లింది. 360 డిగ్రీల కోణంలో తిరిగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.70నుంచి 80వేలను ఒక్కో కెమెరాకు ఖర్చు చేసి అత్యంత టెక్నాలజీతో కూడిన నిఘా పెట్టాలని భావిస్తున్నారు.

ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగినా.. సకాలంలో స్పందించడానికి ఈ కెమెరాలను ఉపయోగించుకోనున్నారు. మొత్తం 400 కెమెరాలకు కలిపి రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి.. అక్కడనుంచి ఏ ప్రదేశంలో ఎలాంటి సంఘటన చోటుచేసుకున్నా స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం చేరవేయనున్నారు.

 జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి..
 జిల్లాలో దాదాపు 185 కిలోమీటర్ల పొడవున్న జాతీయ రహదారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారిపై అక్కడక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో భారీ గ్రేడ్స్ ఉంచి ట్రాఫిక్ సమస్య రాకుండా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై కూడా పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా బీచుపల్లి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బందీ రాకుండా పోలీసులు ముందే నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు నెల రోజులముందే నుంచి పరిసర ప్రాంతాలను వారి అధీనంలోకి తీసుకోనున్నారు. ఘాట్ల సమీపంలో క్యూలైన్ల సరికొత్త భారీ గ్రేడ్స్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది.


 11వేల మందితో బందోబస్తు..
 పుష్కరాల సమయంలో జిల్లాలో బందోబస్తు నిర్వహించడానికి పోలీస్‌శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్థానికంగా ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఘాట్లు ఏర్పాటు చేయడంతో బందోబస్తు భారీ స్థాయిలో ఉండాలని పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల పోలీస్ సిబ్బంది ఉండడంతో అదనంగా మరో 8వేల మందిని ఇతర జిల్లాలనుంచి రప్పిస్తున్నారు. దీంట్లో సివిల్ పోలీసులతో పాటు పారా మిలిటరీ, ట్రాఫిక్ ఇతర విభాగాలు వారు ఉండనున్నారు. ముఖ్యంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల  వాహనాలను పార్కింగ్ స్థలాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు