ఆ వివాహాలపై అనుసరిస్తున్న విధానమేంటి?

12 Oct, 2017 05:28 IST|Sakshi

కేంద్రం, ఇరు రాష్ట్రాల మైనారిటీ సంక్షేమ శాఖలకు హైకోర్టు ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: పేద ముస్లిం యువతుల ఆర్థిక నేపథ్యాన్ని ఆసరాగా తీసుకుని వృద్ధ అరబ్‌ షేక్‌లు వారిని వివాహం చేసుకుంటున్న ఘటనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ విషయంపై దృష్టి సారించింది. విదేశీయులతో ముఖ్యంగా అరబ్‌ షేక్‌లతో జరిగే వివాహాల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ఏమిటో తెలపాలని కేంద్రప్రభుత్వంతోపాటు ఇరు రాష్ట్రాల మైనారిటీ సంక్షేమ శాఖలు, వక్ఫ్‌బోర్డ్‌లను ఆదేశించింది. చట్టంలో ఉన్న లోపాల్ని అడ్డంపెట్టుకుని వివాహాలు జరిపించే సమయంలో జరుగుతున్న దుర్వినియోగం, దోపిడీని అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా తెలపాలని కోరింది.

ఇందులో భాగంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖతోపాటు తెలంగాణ మైనారిటీ సంక్షేమశాఖ, తెలంగాణ వక్ఫ్‌బోర్డులను ప్రతివాదులుగా చేర్చింది. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యాప్‌ల ద్వారా వివాహాల్ని రిజిస్టర్‌ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వక్ఫ్‌బోర్డులు వాటి రికార్డులను నిర్వహించవచ్చునంటూ.. తద్వారా వివాహాల రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని సమర్థంగా ఉపయోగించుకునే వీలుంటుందని అభిప్రాయపడింది. తాము కోరిన వివరాల్ని తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని కేంద్రం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, వక్ఫ్‌బోర్డులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు