హైదరాబాద్‌ టు మేడారం హెలికాప్టర్‌

3 Feb, 2020 04:32 IST|Sakshi
హెలికాప్టర్‌ సేవలను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌..

సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సనత్‌నగర్‌: తెలంగాణ కుంభమేళా మేడారం జాతర నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి మేడారానికి గగన మార్గాన చేరుకునేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ప్రత్యేక రైళ్లు, బస్సులను ప్రారంభించగా.. తాజాగా హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బేగంపేట పాత ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌–మేడారం హెలికాప్టర్‌ సేవలను టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర అని పేర్కొన్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తుంటారని, గత ప్రభుత్వాలు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా వదిలేశాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకృతి సౌందర్యాలకు నెలవైన మేడారంలో అవసరమైన ఏర్పాట్లు చేశారని చెప్పారు. మేడారం జాతర ద్వారా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధకరమన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.కోట్ల వ్యయంతో అక్కడ విడిది సౌకర్యం, రోడ్ల నిర్మాణం వంటి అన్ని రకాల వసతులు కల్పించారని పేర్కొన్నారు. ఏవియేషన్‌ శాఖ సహకారంతో టూరిజం శాఖ హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్‌ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్, పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌ భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభం 
హన్మకొండ: ములుగు జిల్లా మేడారంలో జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 51 ప్రత్యేక బస్‌ స్టేషన్ల నుంచి ఆదివారం బస్సులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 34 ప్రత్యేక బస్‌ స్టేషన్లు, అలాగే రాష్ట్రంలోని మిగతా 16 ప్రత్యేక బస్‌ స్టేషన్లతో పాటు మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ప్రత్యేక బస్సులు మేడారానికి నడిపిస్తున్నారు.

మేడారం ప్యాకేజీలు ఇవే.. 
బేగంపేట పాత విమానాశ్రయం నుంచి మేడారానికి, తిరిగి మేడారం నుంచి బేగంపేట విమానాశ్రయానికి హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించారు. ప్యాకేజీలో భాగంగా ఆరుగురు ప్రయాణి కులకు రూ.1,80,000 ప్లస్‌ జీఎస్టీని (అప్‌ అండ్‌ డౌన్‌) నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా రానుపోను హెలికాప్టర్‌ చార్జీ లు, హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక వాహన సౌకర్యంతోపాటు వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. మేడారంలో జాతర వ్యూ చూసేం దుకు ప్రతి ప్రయాణికుడికి రూ.2,999 చార్జీ వసూలు చేస్తారు. హెలికాప్టర్‌ సేవల కోసం 9400399999ను సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు